మేయర్ సీటునుపట్టుబడుతున్న చైతన్య? జనసేన పొత్తు, ఆదికేశవులు అస్త్రం ప్రయోగం ఇప్పటికే సీటు ఆశిస్తున్న రెండు వర్గాల్లో ఆందోళన అంతర్మథనంలో చిత్తూరు దేశం నాయకులు మేయర్ ఇవ్వాల్సిందేనని జనసేన ఒత్తిడి
సాక్షి, చిత్తూరు: చిత్తూరు కూటమి పార్టీలో అనుకోని అతిథి వచ్చి పడ్డారు. బెంగళూరులో ఉంటున్న దివంగత టీటీడీ చైర్మన్ ఆదికేశవులు నాయుడు మనవరాలైన చైతన్య లలితాంబిక చిత్తూరు రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు జెండాలు మోసి పలువురి విజయానికి కృషి చేసిన తమ పరిస్థితి ఏమిటని చిత్తూరులోని రెండు సామాజిక వర్గాలు అంతర్మథనంలో పడ్డాయి. చైతన్య స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా చిత్తూరు నగర మేయర్ పదవి ఆశిస్తుండడం కూటమి పార్టీ లో చిచ్చు రేపుతోంది.
ఎవరికేమి చేశారని?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 28 నెలల కాలంలో జిల్లాలో ఎన్నో నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. ఇందులో కాణిపాకం వినాయక స్వామి ఆల య బోర్డు చైర్మన్, చిత్తూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (చుడా), ఏపీ వన్నెకుల క్షత్రియ కో–ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, జిల్లా కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు (డీసీసీబీ) చైర్మన్, ఆర్టీసీ చైర్మన్, కుప్పం రెస్కో, కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ చైర్మన్, చిత్తూ రు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ, పెనుమూరు, కుప్పం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులన్నీ టీడీపీ నేతలకే దక్కింది. పేరుకు కూటమి ప్రభుత్వమని చెప్పుకుంటున్నా, పదవుల భర్తీలో తమను ఏ మాత్రం గుర్తించడం లేదని కూటమి లోని బీజేపీ, జనసేన నేతలు పలు సందర్భాల్లో సామాజిక మాధ్యమాల వేదికగా బహిరంగంగా పోస్టులు పెట్టారు. ఇలాంటి తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండడంతో చిత్తూరు మేయర్ స్థానంపై కూటమిలోని మిగిలిన రెండు పార్టీలు పట్టుగా ఉన్నాయి.
మేయర్ కుర్చీ జనసేనదే!
2024 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎమ్మెల్యేగా గెలుపొందిన గురరజాల జగన్‌మోహన్ నాయుడు అందర నీ ఆశ్చర్యపరిచారు. అసలు గెలుపు వరిస్తుందనే విష యం ఆయన కూడా ఉహించి ఉండరు. అప్పటి వరకు ఎమ్మెల్యే సీటు కోసం చిత్తూరు టీడీపీలోని బలిజ (కాపు) సామాజికవర్గ నేతలు తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. అప్పటికే జనసేన పార్టీలో చేరిన ఆదికేశవులు నాయుడు మనవరాలు చైతన్య లలితాంబిక కూడా జనసేన పార్టీ తరపున చిత్తూరు ఎమ్మెల్యే టికెట్టు ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో చిత్తూరు మేయర్ సీటుపై ఆమె ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా ఇటీవల చిత్తూ రు నగరంలో కాజూరు చెరువు అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే జగన్‌మోహన్‌తో కలిసి పర్యటించి మేయర్ పోటీలో తాను కూడా ఉన్నట్లు సంకేతాలిచ్చారు. రెండు రోజుల క్రితం పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌ను కలిసిన ఈమె.. మేయర్ సీటు కోసం మురళీమోహన్ మద్దతు కోరినట్లు ప్రచారం సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ చిత్తూరు సీటు జనసేన పార్టీకే దక్కాలని ఇప్పటికే స్థానిక జనసేన సైనికులు పట్టుబడుతున్నారు. తమ నాయకుడి మాట కోసం సర్వం ఒడ్డి, టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ గెలుపులో కీలక పాత్ర పోషించిన తమకు చిత్తూరు మేయర్ కుర్చీ ఇవ్వాల్సిందేనని కోరుతున్నారు.
ఆశా..? నిరాశ..?
ఆదికేశవులు కుటుంబం నుంచి చిత్తూరు మేయర్ కోసం తన తాత పేరుతో పాటు, జనసేన కార్డు వా డుతుండడం చైతన్య రాజకీయ భవిష్యత్తుకు చావో, రేవో తేల్చనుంది. ఇదే సమయంలో చైతన్య రాకతో చిత్తూరులో ఇప్పటికే మేయర్ కుర్చీ ఆశిస్తు న్న రెండు సామాజిక వర్గాల్లోని ప్రధాన నాయకులు కారాలు– మిరియాలు నూరుతున్నారు. ఆదికేశవులు నాయు డు, ఆయన సతీమణి సత్యప్రభతోనే చిత్తూరులో ఆ కుటుంబం రాజకీయ పయణం ముగిసిందని చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న వాళ్లంతా కాలక్షేప రాజకీయాలు, ఆర్థిక హోదాకు ఓ పదవి కావాలని చూస్తున్నారని, సేవ చేయడానికి కాదని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అది ముమ్మాటికీ చైతన్యకు అడ్డు కట్ట వేయడానికేనని స్పష్టమవుతోంది. కూటమి కుంపటిలో చైతన్య రాక చిచ్చురేపుతున్నా, ఇన్నాళ్లు పలు నామినేటెడ్ పదవులను వదులుకున్నట్లు చిత్తూరు మేయర్ కుర్చీని సైతం టీడీపీ నేతలకు జనసేన–బీజేపీ నేతలు త్యాగం చేస్తారో..? పోటీలో తమ తరువాతేనని కాలుదువ్వుతారో వేచి చూడాల్సి ఉంది.


