విజయపురం (నగరి) : జిల్లా ఎస్పీ తుషార్ డూడీ ఆదేశాల మేరకు, నగరి డీఎస్పీ చంద్రశేఖర్ సూచనలతో పోలీసులు ఆదివారం సారా తయారీ స్థావరాలపై దాడులు చేశారు. నగరి రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ వి.భాస్కర్ ఆధ్వర్యంలో విజయపురం పోలీస్ స్టేషన్ సిబ్బంది కోసలనగరం రెవెన్యూ పరిధిలోని అటవీ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అక్కడ సారా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 200 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. నాటుసారా తయారీ, విక్రయాలపై నిఘా కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
గుడిపాల: మండలంలోని మరకాలకుప్పం గ్రామం వద్ద ఆదివారం కారు ఢీకొనడంతో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. రాణిపేటకు చెందిన సురేష్(40) ఆదివారం సొంత పనుల నిమిత్తం ద్విచక్ర వాహనంలో వెళ్తున్నాడు. మరకాలకుప్పం వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అతన్ని స్థానికులు 108 ద్వారా చీలాపల్లె సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. గుడిపాల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జింకపై కుక్కల దాడి
కుప్పం రూరల్ : కుప్పం – కంగుంది రోడ్డులో ఆదివారం మధ్యాహ్నం శిలకాల వంక వద్ద కుక్కల దాడిలో జింక గాయపడింది. ఒక జింక తాగునీటి కోసం అడవి నుంచి బయటికి వచ్చింది. దీన్ని గమనించిన కుక్కలు దాడి చేశాయి. రోడ్డు పక్కన గాయాలతో పడి ఉన్న జింకను ప్రయాణికులు గమనించి అటవీ అధికారులకు అప్పగించారు. వారు దానికి చికిత్స చేసి అడవిలో వదిలిపెట్టారు.
బైక్ దొంగల ముఠా అరెస్ట్
తిరుపతి క్రైమ్ : ముగ్గురు బైక్ దొంగలను అరెస్టు చేసినట్టు ఏఎస్పీలు రవి మనోహరాచారి, శ్రీనివాసులు తెలిపారు. నిందితుల నుంచి 24 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. వారు ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ యాదమరి మండలానికి చెందిన వినోద్‌కుమార్, చెర్లోపల్లెకి చెందిన గోవిందరాజులు, గోవిందస్వామి మురళి చోరీలకు పాల్పడుతున్నట్టు తెలిపారు. వినోద్‌కుమార్‌పై 21, గోవిందరాజులుపై 14, మురళిపై 17 కేసులు ఉన్నట్లు వివరించారు. స్వాధీనం చేసుకున్న వాహనాల్లో తిరుపతికి చెందిన ఐదు బైక్‌లు, ఎస్సార్‌పురం పోలీస్ స్టేషన్‌న్ పరిధిలో మరో బైక్ ఉన్నట్లు గుర్తించామన్నారు. మిగిలిన వాహనాల యజమానులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు.
చెడ్డీ గ్యాంగ్ కదలికలపై నిఘా
తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపిస్తున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. జిల్లా వ్యాప్తంగా బీట్ వ్యవస్థను మరింత బలోపేతం చేశారు. అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టడంతో పాటు లాడ్జీలు, వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. తనిఖీల ఫ్రీక్వెన్సీని పెంచి.. బీట్ సిబ్బంది ద్వారా నిరంతరం నిఘా కొనసాగిస్తున్నట్లు అదనపు ఎస్పీ రవి మనోహర ఆచారి తెలిపారు.
వ్యభిచార గృహంపై దాడి
తిరుపతి క్రైమ్ : తిరుపతి శివజ్యోతినగర్‌లోని వ్యభిచారం గృహంపై శనివారం రాత్రి అలిపిరి పోలీసులు దాడి చేశారు. గెస్ట్‌హౌస్ మేనేజర్ శంకర్ జీవితం(37)తో పాటు విటులుగా అనుమానిస్తున్న చింత కదిరయ్య (35), సుంకర లక్ష్మీపతి (29), మాదిరి హరి (31)ని అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు శ్రీనివాస గెస్ట్‌హౌస్‌లో దాడులు చేశారు. మొదటి అంతస్తులోని మూడు గదుల్లో అనుమానాస్పద స్థితిలో ఉన్న ముగ్గురు పురు షులు, నలుగురు మహిళలను అదుపులోకి తీసుకుని విచారించారు. గెస్ట్‌హౌస్ మేనేజర్ వివిధ ప్రాంతాల నుంచి మహిళలను తీసుకువచ్చి వ్యభిచార చేయిస్తున్నట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.28 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మేనేజర్ వద్ద రూ.22 వేలు, ముగ్గురు విటుల వద్ద రూ.6 వేలు ఉన్నట్లు పోలీసులు వివరించారు. పట్టుబడిన మహిళలను బాధితులుగా గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. వారికి చట్టప్రకారం అవసరమైన రక్షణ కల్పించామన్నారు. ఈ వ్యవహారంలో సంతోషి అలియాస్ లక్ష్మీకాంతం అనే మహిళ పాత్రపై కూడా దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. వ్యభిచార కార్యకలాపాలకు వేదికగా ఉపయోగించిన శ్రీనివాస రెసిడెన్సీ అండ్ గెస్ట్‌హౌస్‌ను మూసివేసేందుకు ఆదేశాలు ఇవ్వాలని తిరుపతి ఆర్‌డీఓకు లేఖ రాయనున్నట్లు వెల్లడించారు. గెస్ట్‌హౌస్‌లు, లాడ్జీలు, ఇతర వాణిజ్య ప్రాంగణాలను అసాంఘిక కార్యకలాపాలకు వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అలిపిరి పోలీసులు హెచ్చరించారు.


