చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పేద కూలీలకు ఉపాధి కల్పించాల్సి ఉండగా, క్షేత్రస్థాయిలో నిబంధనలు విచ్చలవిడిగా ఉల్లంఘిస్తున్నారు. జిల్లాలోని వి.కోట మండలం నేర్నిపల్లి పంచాయతీ పైపల్లి చెరువులో ఆదివారం ఉదయం ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జేసీబీతో మట్టి తవ్వకాలు జరిపారని, ఆ తర్వాత కూలీలతో పనులు చేయిస్తున్నట్లు కలరింగ్ ఇస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిబంధనల ఉల్లంఘనపై డ్వామా పీడీ రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు. ముందుగా యంత్రాలతో పనులు పూర్తి చేసి, అనంతరం ఉపాధి కూలీలను రంగంలోకి దించి మస్టర్లు నమోదు చేస్తూ బిల్లులు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఫొటో, ఆధారాలతో సహా పీడీకి అందజేశారు. డ్వామా పీడీ తక్షణమే స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించాలని కోరారు.


