చిత్తూరు కలెక్టరేట్ : 2018 నుంచి రావాల్సిన పెండింగ్ డీఏ అరియర్స్ బిల్లుల నమోదుకు నిధి పోర్టల్‌లో వెంటనే సీఎఫ్‌ఎంఎస్ టైల్స్ ఓపెన్ చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 2018 జూలై నుంచి విడుదల చేసిన డీఏల అరియర్ బిల్లులు దాఖలు చేయడానికి సీఎఫ్‌ఎంఎస్‌లో టైల్స్ ఓపెన్ చేయకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నట్టు తెలిపారు. సీపీఎస్, పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే వారికి రావలసిన డీఏ బకాయిల చెల్లింపులకు వీలుగా టైల్స్ అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. అలాగే పదవీ విరమణ పొందిన ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఎన్‌క్యాష్‌మెంట్, ఈఎల్స్, గ్రాట్యూటీ బకాయిలను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. లోకల్ క్యాడర్ ఆర్గనైజేషన్ ఉత్తర్వుల అమలులో విడుదల చేసిన సమగ్ర సీనియారిటీ జాబితాలోని లోపాలను సవరించి, పారదర్శకంగా సిబ్బంది కేటాయింపులు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు రెడ్డెప్పనాయుడు, ప్రధాన కార్యదర్శి మణిగండన్, నాయకులు సదాశివరెడ్డి, రహనాబేగం, ఏకాంబరం, దీనావతి, సోమశేఖర్‌నాయుడు, ఈశ్వర తదితరులు పాల్గొన్నారు.


