● కత్తులతో ద్విచక్ర వాహనదారులను బెదిరిస్తున్న దుండగులు ● నగలు, సెల్‌ఫోన్లు, నగదు లాక్కుంటున్న వైనం
గుడిపాల: మండలంలో దొంగల ముఠా హల్‌చల్ చేస్తోంది. నెల క్రితం చిత్తూరు–వేలూరు రహదారిలో ఓ యువకుడు ద్విచక్ర వాహనంలో తిరువణ్ణామలై వెళ్లి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు కత్తులు చూపించి సెల్‌ఫోన్‌ను లాక్కున్నారు. గుడిపాలలో మరో వ్యక్తి వద్ద డబ్బులు డిమాండ్ చేశారు. అతని వద్ద డబ్బులు లేకపోవడంతో సెల్‌ఫోన్‌ను అడిగారు. బటన్ ఫోన్ ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు. రెండురోజుల క్రితం వసంతాపురం గ్రామానికి చెందిన 30 మంది మహిళలు కోలాటం నేర్చుకుని ఇంటికి వస్తుండగా ఇద్దరు వ్యక్తులు కత్తులతో వారిని బెదిరించారు. మెడలో ఉన్న బంగారు చైన్లను లాక్కునేందుకు ప్రయత్నించగా వారు తిరగబడడంతో దొంగలు వెనక్కు తగ్గారు. వసంతాపురం గ్రామంలో ఉన్న ఓ సీసీ కెమెరాలో ఇదంతా రికార్డు అయ్యింది.
జాతీయ రహదారే టార్గెట్
చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిలో నిత్యం వేలాది వాహణాలు ప్రయాణిస్తుంటాయి. దీంతో పాటు ద్విచక్ర వాహనదారులు కూడా ప్రయాణాలు సాగిస్తుంటారు. దొంగలు వీటిని ఆసరాగా తీసుకుని దాడులు చేస్తున్నారు. ఒంటరిగా వెళ్తున్న వారిని ఆపి కత్తులు చూపించి నగదు, బంగారాన్ని దోచుకుంటున్నారు. కొంతమంది ఈ విషయాలను అవమానంగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేయడం లేదు. ఇకనైనా పోలీసు శాఖ నిఘా పెట్టి దొంగలపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.


