లెక్కగా నొక్కేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

లెక్కగా నొక్కేస్తున్నారు!

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

మామిడి రైతుకు దక్కాల్సిన ప్రోత్సాహకంపై అక్రమార్కుల కన్ను కేజీకి రూ.4 చొప్పున కొల్లగొట్టేందుకు స్కెచ్‌ ఫ్యాక్టరీలు, ర్యాంపుల్లో నకిలీ బిల్లులు దందా నడిపిస్తున్న టీడీపీ నేతలు అవకతవకలపై కలెక్టర్‌ సీరియస్‌

ఆరుగాలం కష్టించే అన్నదాతకు ఆవేదనే మిగులుతోంది.. పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకోలేని దుస్థితి వెంటాడుతోంది. అసలే కొనేవారు లేక కుదేలైన మామిడి రైతుల పరిస్థితి మరింత అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ప్రకటించిన అరకొర ప్రోత్సాహకాన్ని సైతం కాజేసేందుకు అక్రమార్కులు పన్నాగాలు పన్నారు. టీడీపీ నేతల అండదండలతో రైతన్న నోటి కాడ కూడును స్వాహా చేసేస్తున్నారు. నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కాజేస్తున్నారు. దొంగ లెక్కలతో గోల్‌మాల్‌ వ్యవహారం నడిపిస్తున్నారు.

కాణిపాకం : అహర్శిశలు శ్రమించిన మామిడి రైతుకు దక్కాల్సిన ప్రభుత్వ ప్రోత్సాహకం అక్రమార్కుల జేబులు నింపుతోంది. మార్కెట్‌లో ధర లేక తీవ్రంగా నష్టపోయిన తోతాపురి మామిడి రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం కిలోకు రూ.4 చొప్పున ప్రోత్సాహక నిధిని ప్రకటిస్తే, ఆ సొమ్ముపై టీడీపీ నేతలు, దళారులు డేగకన్ను వేశారు. పలు ఫ్యాక్టరీలు, కొనుగోలు ర్యాంపులను అడ్డాగా చేసుకుని రూ.కోట్లలో బిల్లుల గోల్‌మాల్‌ చేస్తున్నారు. అసలు తోటల నుంచి ఒక్క మామిడి కాయ కూడా ఫ్యాక్టరీకి రాకుండానే, కేవలం ఇతర వాహనాలు, ట్రాక్టర్ల నంబర్లు మార్చి వేలాది టన్నుల కాయలు తోలినట్లు కాగితాల్లో నకిలీ లెక్కలను ఇప్పటికే రాసేశారు. సెంటు భూమి కూడా లేని వ్యక్తుల పేరు మీద మామిడి కాయలు అమ్మినట్లు నకిలీ బిల్లులు తయారు చేసి సమర్పించేశారు. ఈ మేరకు అధికార పార్టీ నేతలు దుర్మార్గంగా ఫ్యాక్టరీలు, ర్యాంపుల నిర్వాహకులపై ఒత్తిడి తెచ్చి నకిలీ రికార్డులు సృష్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

రికార్డుల్లో కొండంత

జిల్లాలోని 33 ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీల ద్వారా 38,600 మంది రైతులు 1.82 లక్షల మెట్రిక్‌ టన్నులు, అలాగే 52 ర్యాంపుల ద్వారా 37వేల మంది రైతులు 1.53 లక్షల మెట్రిక్‌ టన్నుల కాయలు తోలినట్లు రికార్డుల్లో చూపిస్తున్నారు. మొత్తంగా 75,600 మంది రైతుల పేరిట 3.35 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోళ్లు జరిగినట్లు లెక్కలు చూపుతున్నారు. అయితే వీరిలో రైతులెవరో, అక్రమార్కులేవరో గుర్తించడం ఉద్యాన శాఖ అధికారులకు పెద్ద సవాల్‌గా మారింది.

అక్రమాలను సహించం : కలెక్టర్‌

ఫ్యాక్టరీలు,ర్యాంపుల్లో జరుగుతున్న బిల్లుల మాయాజాలంపై కలెక్టర్‌ తీవ్రంగా స్పందించారు. ఫ్యాక్టరీలు, ర్యాంపుల ద్వారా సమర్పించిన ప్రతీ బిల్లునూ క్షుణ్ణంగా పరిశీలించాలని, నకిలీలను ఏరిపారేయాల ని ఆదేశాలు జారీ చేశారు. అక్రమాలను ఏమాత్రం సహించేది లేదని, అర్హులైన రైతులకు మాత్రమే ప్రోత్సాహకం అందేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అయితే దందా వెనుక టీడీపీ నేతలు ఉండడంతో ఉద్యానశాఖ అధికారులు విచారణలో ఏం తేలుస్తారో వేచి చూడాల్సి ఉంది.

నిబంధనల మెలిక

అక్రమార్కుల దందాను అరికట్టాల్సిన ఉద్యాన శాఖ సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతోంది. క్షేత్రస్థాయిలో పరిశీలనకు సరిపడా అధికారులు లేకపోవడం నకిలీరాయుళ్లకు కలసివస్తోంది. అలా గే ఈ–క్రాప్‌ నమోదు అరకొరగానే సాగడంతో రైతుకు ఎంత భూమి ఉందో కచ్చితంగా సరిపోల్చలేకపోతున్నారు. దీంతో అధికారులు కొత్త పల్లవి అందుకున్నారు. ఎకరాకు 7 టన్నుల దిగుబడికి మాత్రమేనని మెలిక పెట్టారు. రూ.4 ప్రభుత్వ ప్రోత్సాహక నిధిలో కోత పెట్టేందుకే ఈ నిబంధన తీసుకువచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై రైతు సంఘ నేతలు మండిపడుతున్నారు. రైతుల కడుపు కొట్టేందుకు అధికారులు ఇలాంటి నిబంధనలను తీసుకువస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెట్టు వయసును బట్టి ఎకరాకు 20 టన్నుల కాయలు వస్తాయని గుర్తుచేస్తున్నారు. అధికారులు ఎకరాకు 7 టన్నుల వరకు మాత్రమే ప్రోత్సాహకమని నిబంధన పెడితే రోడెక్కుతామని హెచ్చరిస్తున్నారు. అక్రమార్కుల జేబులు నింపడానికే నిజమైన రైతుల నోరుకొట్టడం సరికాదని స్పష్టం చేస్తున్నారు.

కడుపు కొట్టొద్దు

ఎకరాకు 7 టన్నుల కాయల వరకు మాత్రమే ప్రోత్సాహకం పరిమితం చేసి రైతుల కడుపు కొట్టొద్దు. నిజమైన రైతుకు మేలు చేయండి. ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో.. వారిపై చర్యలు తీసుకోండి. అంతే తప్ప రైతులు తోలిన కాయల విషయంలో కోతలెందుకు? ప్రభుత్వం కేజీకి రూ.4ల ప్రోత్సాహక నిధి చెల్లిస్తామని ప్రకటించిన రోజు కూడా ఇలాంటి నిబంధన లేదు. ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదు.

– మునీశ్వర్‌రెడ్డి, మామిడి రైతుల సంఘం అధ్యక్షుడు, చిత్తూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement