చిత్తూరు అర్బన్ : చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పోలీసు ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్)కు 52 వినతులు అందాయి. ఎస్పీ తుషార్ డూడీ ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీ త గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయా స్టేషన్ హౌస్ అధికారులతో మా ట్లాడారు. అలాగే చిత్తూరు నాన్‌కేడర్ ఎస్పీ రాజశేఖర రాజు, ఏఎస్పీ షాను, చిత్తూరు డీఎస్పీ వెంకట నారా యణ సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
‘వందనం’ అందలేదని ఫిర్యాదు
పుత్తూరు : ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద రూ.13 వేల చొప్పున మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ ఊదరగొడుతున్నారు. అయితే వాస్తవానికి అర్హులైన ఎందరో తల్లులకు ఎగనామం పెడుతున్నారన్నది అక్షర సత్యం. సోమవారం తిరుపతి కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో ఓ దళిత దివ్యాంగుడు రెండేళ్లుగా తమ కుటుంబానికి తల్లికి వందనం పథకం అందలేదని ఫిర్యాదు చేయడమే ఇందుకు నిలువెత్తు నిదర్శనం. వివరాలు.. పుత్తూరు మున్సిపాలిటీ 13 వార్డు నందిమంగళం దళితవాడకు చెందిన కె.శివయ్య, జయలక్ష్మి దంపతుల పిల్లలైన కె.పావని 10వ తరగతి, కె.తనుశ్రీ 8వ తరగతి పుత్తూరులోని శేషసాయి హైస్కూల్‌లో చదువుతున్నారు. అలాగే కె.మోక్షిత శ్రీచైతన్య స్కూల్‌లో 5వ తరగతి చదువుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మఒడి పథకం ద్వారా పెద్ద కుమార్తె పావని పేరిట ఏటా రూ.14 వేలు వారి ఖాతాలో జమైంది. అయితే 2024 జూన్‌లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2025–26 విద్యా సంవత్సరానికి గానీ, ప్రస్తుత 2026–27 విద్యా సంవత్సరానికి గానీ ముగ్గురు పిల్లల్లో ఒక్కరికి కూడా తల్లికి వందనం పథకం అందలేదు. దీనిపై సమగ్రంగా విచారణ జరిపి తమకు న్యాయం చే యాలని శివయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కిడ్నాప్ కేసులో నిందితుడి అరెస్టు
తనకల్లు : కిడ్నాప్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు సత్యసాయి జిల్లా తనకల్లు ఎస్‌ఐ దిలీప్‌కుమార్ తెలిపారు. వివరాలు... చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం జెట్టిపల్లెకు చెందిన గల్లా హేమచంద్ర మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి 2019లో గందోడివారిపల్లెకు చెందిన నరేష్, నైనాను కిడ్నాప్ చేసి రూ.3 లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో కేసు నమోదుచేసి విచారణ చేపట్టిన పోలీసులు అప్పట్లోనే ఇద్దరిని అరెస్టుచేశారు. గల్లా హేమచంద్ర పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఇటీవల గల్లా హేమచంద్ర చిత్తూరు–తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నట్లు పక్కా సమాచారం అందుకున్న ఎస్‌ఐ తన సిబ్బందిని పంపి నిందితుడిని అరెస్టు చేశారు. సోమవారం కదిరి కోర్టులో హాజరుపరచగా నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు.


