వినతి.. విరక్తి | - | Sakshi
Sakshi News home page

వినతి.. విరక్తి

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

● ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వెల్లువెత్తిన అర్జీలు ● అధికారుల అలసత్వంతో ఆవేదన చెందుతున్న బాధితులు ● పింఛన్‌ కోసం ప్రదక్షిణలు చేస్తున్న అభాగ్యులు ● కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో వినతులు స్వీకరించిన కలెక్టర్‌, జేసీ

ఫించన్‌ ఇప్పించండి.. భూ ఆక్రమణను అడ్డుకోండి.. ఉపాధి కల్పించి ఆదుకోండి.. బెదిరింపుల నుంచి కాపాడండి.. దివ్యాంగుడిని కనికరించండి.. అంటూ సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్‌కు వినతులు వెల్లువెత్తుతున్నాయి. అయితే అధికారుల అలసత్వంతో అర్జీదారులు ప్రతి వారం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో సమస్యల నుంచి గట్టెక్కించండి మహాప్రభో అంటూ వేడుకోవాల్సిన దుస్థితి దాపురించిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పందన కరువై దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నామని వాపోతున్నారు. చివరకు వినతులు సమర్పించడంపై విరక్తి కలుగుతోందని స్పష్టం చేస్తున్నారు.

చిత్తూరు కలెక్టరేట్‌ : ఒకవైపు క్షేత్రస్థాయి అధికారుల బాధ్యతారాహిత్యం.. మరోవైపు పేదరికం, దీనికి తోడు శారీరక వైకల్యం.. ఇవీ సోమవారం చిత్తూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో వెలుగుచూ సిన ప్రధాన సమస్యలు. ప్రజాసమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ, జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకటేష్‌, డీఆర్‌ఓ మోహన్‌ కుమార్‌ అర్జీలు స్వీకరించారు. దశాబ్దాలుగా అనుభవిస్తున్న భూములను నకిలీ పత్రాలు సృష్టిస్తూ, దివ్యాంగుల ఇళ్లను కూల్చేందుకు యత్నిస్తున్నా కింది స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదంటూ బాధితులు కన్నీరుమున్నీరయ్యారు. పలుమార్లు వినతులు అందించినా ప్రయోజనం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

అలసత్వం వహిస్తే సహించం

పీజీఆర్‌ఎస్‌ (గ్రీవెన్స్‌)లో వచ్చే వినతులను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవాలని సూచించారు. ప్రతి అర్జీదారుడితో మాట్లాడి సమస్యను సమగ్రంగా అర్థం చేసుకోవాలని చెప్పారు. సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. భూ సమస్యలకు సంబంధించి వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులపై రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కౌంటర్‌ అఫిడవిట్లను ఆలస్యం చేయకుండా వెంటనే దాఖలు చేయాలని ఆదేశించారు.

జాగ్రత్తలు తప్పనిసరి

జిల్లాలో కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని కలెక్టర్‌ ఆదేశించా రు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే కోవిడ్‌ను అరికట్టవచ్చని స్పష్టం చేశారు. జ్వరం,దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉన్నవారిని వెంటనే సమీప ప్రభుత్వాస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించాలని తెలిపారు. ఆర్‌ డీఓ శ్రీనివాసులు, డిప్యూటీ కలెక్టర్‌ విజయలక్ష్మి, ఫారెస్ట్‌ సెటిల్‌మెంట్‌ ఆఫీసర్‌ పుల్లారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement