నారాయణవనం: పోటీ ప్రపంచంలో మహిళలకు సాధికారతతో పాటు ఆరోగ్యం ఎంతో అవసరమని పలువురు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక సిద్ధార్థ ఇన్‌న్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్, టెక్నాలజీ కళాశాలలో మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో ‘సాధికార మహిళలు – ఆరోగ్యకరమైన జీవితం’ అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న తిరుపతి ఆకృతి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ అఖిల మాట్లాడుతూ జీవితంలో కీలకమైన విద్యార్థి దశలో వ్యక్తిగత ఆరోగ్యపరమైన నిర్ణయాలే మీ భవిష్యత్తును నిర్మిస్తాయన్నారు. శారీరక, మానసిక భావోద్వేగాలు ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయని చెప్పారు. మంచి భావాలతో క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబాలు బలపడతాయన్నారు. ప్రిన్సిపల్ జనార్దనరాజు, మహిళా అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.


