● పదోన్నతుల్లో హెచ్‌సీలకు మొండిచేయి ● అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు.. జోన్లు ● 54 ఏఎస్సై పోస్టులు మూడు జిల్లాలకు పంపిణీ? ● 30 ఏళ్ల సర్వీసుకు మంగళం.. సివిల్‌–ఏఆర్‌లకు నష్టం ● సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం | - | Sakshi
Sakshi News home page

● పదోన్నతుల్లో హెచ్‌సీలకు మొండిచేయి ● అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు.. జోన్లు ● 54 ఏఎస్సై పోస్టులు మూడు జిల్లాలకు పంపిణీ? ● 30 ఏళ్ల సర్వీసుకు మంగళం.. సివిల్‌–ఏఆర్‌లకు నష్టం ● సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం

Jul 14 2026 1:36 AM | Updated on Jul 14 2026 1:36 AM

● పదోన్నతుల్లో హెచ్‌సీలకు మొండిచేయి ● అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులు.. జోన్లు ● 54 ఏఎస్సై పోస్టులు మూడు జిల్లాలకు పంపిణీ? ● 30 ఏళ్ల సర్వీసుకు మంగళం.. సివిల్‌–ఏఆర్‌లకు నష్టం ● సమస్య పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం

చిత్తూరు అర్బన్‌: ఎప్పుడో 1993లో క్రితం పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా చేరారు. అంటే 30 ఏళ్ల క్రితం ఉద్యోగంలో చేరితే, ఇప్పటికి ఎస్‌ఐగా ఉద్యోగ విరమణ పొందాల్సింది. కానీ జిల్లాలోని 54 మందికి పైగా కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరిగింది. రాష్ట్రంలోని జిల్లాలను జోన్ల వారీగా విభజిస్తూ రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చాయి. ఫలితంగా ఎప్పటికై నా ఏఎస్సై పదోన్నతి వస్తుందని భావించిన సివిల్‌, ఏఆర్‌లోని కానిస్టేబుళ్లకు తీవ్ర అన్యాయం జరిగింది.

తప్పెవరిది.. శిక్ష ఎవరికి?

చిత్తూరు, తిరుపతి, మదనపల్లె కలిసి ఉమ్మడి చిత్తూరు జిల్లాగా ఉండగా 1993లో జరిగిన కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీలో వందలాది మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఆపై కానిస్టేబుళ్ల నుంచి హెడ్‌ కానిస్టేబుళ్లుగా పదోన్నతులు లభించాయి. ఇక ఏఎస్సై పోస్టు వస్తుందనుకునేలోపు ఉపద్రవం వచ్చి పడింది. జిల్లా పోలీసు శాఖలోని ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం తీరు వల్ల 2012లో ఏఆర్‌ నుంచి సివిల్‌లోకి వెళ్లిన సిబ్బంది సర్వీసు, అప్పటికే సివిల్‌లో ఉన్న సిబ్బంది సర్వీసును లెక్కించే విషయంలో నిర్లక్ష్యం నెలకొంది. సివిల్‌, ఆర్మడ్‌ రిజర్వ్‌(ఏఆర్‌) పోలీసులకు మధ్య ఎస్టాబ్లిష్‌మెంట్‌ విభాగం అధికారులు సర్వీస్‌ రూల్స్‌ వివాదాన్ని రాజేశారు. దీంతో ఏఆర్‌, సివిల్‌ కానిస్టేబుళ్లు దీనిపై కోర్టు మెట్లు ఎక్కారు. ఫలితంగా చిత్తూరు పోలీసు జిల్లాలో 54 ఏఎస్సై పోస్టులు ఖాళీగా ఉన్నా, భర్తీకు నోచుకోలేదు.

జరగాల్సిన నష్టం

సివిల్‌, ఏఆర్‌ పోలీసుల పదోన్నతుల సర్వీస్‌ రూల్స్‌ న్యాయస్థానమే పరిష్కరిస్తుందని కొందరు హైకోర్టులో రిట్‌ వేశారు. పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా 1998, 2000లో చేరిన వారికి పాతికేళ్లయినా ఒక్క ప్రమోషన్‌ కూడా రాలేదు. కోర్టులో సమస్య పరిష్కారమయ్యేందుకు సమయం పడుతుండడంతో రెండు ఇంక్రిమెంట్లు కోల్పోయినవాళ్లు ఉన్నారు. ఇక జిల్లాల వారీగా జోన్ల విధానం అమల్లోకి రావడంతో మూడు నెలల వరకు పదోన్నతులు ఇవ్వడానికి వీల్లేదు. పైగా జిల్లాలో ఉన్న 54 ఏఎస్సై పోస్టులను తిరుపతి, అన్నమయ్య జిల్లాలకు సర్దుబాటు చేస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే తాము నష్టపోయామని నిట్టూరుస్తున్నారు. ముగ్గురు పోలీసు ఉద్యోగులు ఉద్యోగ విరమణ కూడా పొందడం గమనార్హం.

ఇష్టానుసారంగా మార్పు

జిల్లాలో 1991–94 మధ్యలో కానిస్టేబుళ్లుగా చేరిన సిబ్బందికి ఏపీ స్టేట్‌ అండ్‌ సబార్డినేట్‌ సర్వీస్‌ రూల్స్‌–1996 ప్రకారం ఖాళీలను పరిగణనలోకి తీసుకుని.. 2016–17 మధ్య హెడ్‌ కానిస్టేబుళ్లు(హెచ్‌సీ)గా పదోన్నతి లభించింది. తర్వాత ఏఎస్సైగా పదోన్నతులు 2024–25 మధ్యలో రావాల్సి ఉంది. అమల్లో ఉన్న సర్వీస్‌ రూల్స్‌ ప్రకారం పదోన్నతులు కల్పించాల్సిన పోలీసు శాఖ జిల్లాలో సర్వీసు రూల్స్‌ ఇష్టానుసారం మార్చేశారని పలువురు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. దీంతో పదోన్నతుల ప్రక్రియకు మెలిక పడింది. పోలీసు ప్రధాన కార్యాలయం 2013లో ప్రీ ప్రమోషనల్‌ ట్రైనింగ్‌కు పంపే ప్యానల్‌.. సెప్టెంబర్‌ 1ని ప్రాతిపదికగా నిర్ణయిస్తూ రాష్ట్రంలోని కొన్ని జిల్లాలకు సర్కులర్‌ జారీచేసింది. ఆ తర్వాత కొన్ని జిల్లాలకు జనవరి 1ని ప్రాతిపదికగా తీసుకున్నారు. అయితే, దీని వెనుక ఏపీఎస్‌పీ, ఏఆర్‌ నుంచి వచ్చిన వారి ప్రయోజనాల కోసమేనని సివిల్‌ పోలీసులు ఆరోపిస్తున్నారు. తాము నేరుగా సివిల్‌లో ఎంపికయ్యామని, ఏఆర్‌ పోలీసులు సివిల్‌లోకి కన్వర్షన్‌న్‌ అయినప్పటి నుంచి సర్వీస్‌ పరిగణనలోకి తీసుకుంటే అభ్యంతరం లేదని చెబుతున్నారు. దీనికి ఆర్ముడ్‌ పోలీసులు ససేమిర అంటున్నారు. తాము పోలీసు శాఖలో సీనియర్లమని, ఏ విభాగంలో పని చేసినా తమ సర్వీసును గుర్తించాల్సిందేనని పట్టుబడుతున్నారు. ఏఆర్‌ ఎస్‌ఐల విషయంలో కోర్టు తీర్పును ప్రస్తావిస్తూ అదే విధానాన్ని పాటించాలని కోరుతున్నారు. ఇలా ఇరుపక్షాలు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement