– పుత్తూరులో సంచలనం
పుత్తూరు: పట్టణానికి చెందిన పలు విద్యా సంస్థల అధినేత కోడలు ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో సుమారు 5 కేజీల బంగారానికి సమానమైన రూ.7 కోట్ల మేరకు నష్ట పోయినట్లు సమాచారం. ఈ విషయం బయ టకు పొక్కడంతో ఈ కేసు జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. భర్తకు సైతం తెలియకుండా తాను భారీ గా డబ్బు సంపాదించాలనుకొన్న ఆ ఇంటి కోడలు నిర్వాకంతో ఆ కుటుంబం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది. పుత్తూరులోనే హాస్టల్ నిర్వాహుకురాలైన తన స్నేహితురాలి బ్యాంకు ఖాతాల ద్వారా ఈ మొత్తం ఆన్‌లైన్ ట్రేడింగ్ వ్యవహారం నడిచినట్లు సమాచారం. పోగొట్టుకొన్నది తిరిగి సంపాధించాలన్న పట్టుదలతో తమకు తెలిసిన వ్యక్తులైన సుమారు 50 మంది నుంచి ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించినట్లు ఆమైపె ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరందరి మొత్తాలను కలిపితే కోట్లల్లోనే ఉంటుందని సమాచారం. ఈ మొత్తం వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మహిళ కూడా ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో భారీగా నష్ట పోవడంతో పాటు, ఇతరులు నష్ట పోవడానికి కారకురాలు కావడంతో ఈ కేసులో ఆమె పాత్రపై ప్రత్యేక దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ఆ మహిళ ఒకవైపు బాధితురాలు, మరోవైపు నిందితురాలుగా మారడం పెద్ద చర్చనీయాశమైంది. ట్రేడింగ్‌లో నష్టపోయిన కోట్లాది రూపాయలకు లెక్కలు ఉన్నాయా, ఎవరి వల్ల ఎవరు నష్ట పోయారు వంటి అన్ని అంశాలు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. బాధితుల నుంచి పోలీసులకు ఫిర్యాదు అందిందని, దర్యాప్తు వేగంగా జరుగుతోందని, మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు మీడియా ముందు ఉంచుతామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి స్పష్టం చేశారు.


