చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లాలో నైరుతి రుతుపవనాలు నిరాశపరిచాయి. ఆశించిన స్థాయిలో వర్షం కురవకుండా మొండికేస్తున్నాయి. అక్కడక్కడా చెదురుమదురు జల్లులు పడుతుండడంతో ఖరీఫ్ సాగుకు రంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 44,268 హెక్టార్లు ఉండగా.. ఇప్పటి వరకు సాగులో ఉన్న పంటలు 3,262 హెక్టార్లు మాత్రమే. చాలా మంది విత్తనా లు వేసేందుకు సిద్ధమవుతుండగా, ఎరువుల షాపుల ముందు కనిపిస్తున్న ధరల పట్టికలు వారి గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. యూరియా, డీఏపీ ధరల్లో స్వల్ప మార్పు ఉన్నప్పటికీ, పంట దిగుబడికి ప్రాణాధారమైన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. బస్తాకు రూ.300 నుంచి ఏకంగా రూ.700 వరకు ధరలను పెంచేయడంతో, సాగు ఖర్చు ఊహించని విధంగా తడిసి మోపెడవుతోంది.
మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు
ప్రభుత్వం కొన్ని ఎరువులకే రాయితీని పరిమితం చేసింది. కాంప్లెక్స్ ఎరువుల ధరలను నిర్ణయించే అధికారాన్ని తయారీ కంపెనీలకే వదిలేసింది. దీంతో కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచి రైతుల నడ్డి విరుస్తున్నాయి.
నిమ్మకు నీరెత్తిన సర్కారు
ఎరువుల కొరతను సాకుగా చూపుతూ కొందరు డీలర్లు బ్లాక్ మార్కెటుకు తెరలేపారు. యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూల్లో నిలబడాల్సిన దుస్థితి నెలకొంది. అధిక ధరలు చెల్లిస్తేనే ఎరువులు దొరుకుతున్నాయని, లేదంటే నిల్వలు లేవని సమాధానం వస్తోందని రైతులు ఆరోపిస్తున్నారు. పాలకులు క్షేత్ర స్థాయి పరిస్థితులను విస్మరించి, కేవలం రంగురంగుల ప్రకటనలకే పరిమితం కావడం వల్లనే ఈ దుస్థితి దాపురించిందని రైతు సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం మేల్కొని, ఎరువుల ధరల నియంత్రణకు చర్యలు చేపట్టాల్సి ఉంది.
ప్రకృతి ప్రకోపాలు, మద్దతు ధర లేక అగచాట్లు.. వెరసి వ్యవసాయం అంటేనే ఇప్పుడు పీడకలగా మారింది. ఆరుగాలం కష్టపడినా పెట్టిన పెట్టుబడి సైతం చేతికందని దుస్థితి నెలకొంటోంది. ఇలాంటి సమయంలో ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోవడం రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం కుంటుపడటమే కాకుండా, ఎరువుల ధరలు ఆకాశాన్నంటుతుండడంతో అన్నదాతలు అగచాట్లు పడాల్సి వస్తోంది.
దడ పుట్టిస్తున్న కొత్త ధరల పట్టిక
ఎరువు పాత కొత్త పెరిగిన
రకం ధర (రూ.) ధర (రూ.) భారం (రూ.)
16–20–0–13 1,400 2,000 + 600
12–32–16 1,900 2,450 + 550
10–26–26 1,950 2,450 + 500
14–35–14 1,900 2,350 + 450
24–24–0 2,000 2,450 + 450
ఎస్‌ఎస్ పి 615 1,000 + 385
16–16–16 1,675 2,050 + 375
20–20–0–13 1,800 2,150 + 350
15–15–15–09 1,650 1,950 + 300
ఎంవోపి 1,850 1,975 + 125
ఈ భారం ఎలా మోసేది?
విజయ డెయిరీ మూసివేసి కొన్నాళ్లు చాలా అవస్థలు పడ్డాం. పాడి పరిశ్రమను వదులుకున్నాం. కొన్నాళ్లకు షుగర్ ఫ్యాక్టరీ మూతపడడంతో చెరుకు సాగు విస్తీర్ణం పడిపోయింది. సబ్సిడీ వేరుశన విత్తనాలు సకాలంలో అందించకపోవడంతో సాగుకు సమాయత్తం కాలేని పరిస్థితి దాపురించింది. ఇక మామిడి రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. అరకొరగా సాగయ్యే పంటలకు కూడా ఎరువుల భారం పడితే రైతులు ఏం చేయాలి..? పంట వేస్తే ఎరువులు దొరకవు, దొరికితే కొనే ధర ఉండదు. మరి మేం సాగు చేయడం ఎందుకు?
–హేమంత్‌నాయుడు, కుర్చివేడు, చిత్తూరు మండలం


