ఓటరుగా నమోదు చేసుకో! | - | Sakshi
Sakshi News home page

ఓటరుగా నమోదు చేసుకో!

Jul 12 2026 11:58 PM | Updated on Jul 12 2026 11:58 PM

ఎన్నికల సంఘం కీలక నిర్ణయం!

జనవరి 1తో పాటు ఏడాదంతా నాలుగు అర్హత తేదీల ప్రకటన

18 ఏళ్లు నిండిన వెంటనే ఓటు హక్కు.. జాబితాలో చేరనున్న సరికొత్త ఓటర్లు

జిల్లాలో 25 వేల మందికి పైగా యువతకు దక్కనున్న సువర్ణావకాశం

చిత్తూరు కలెక్టరేట్‌ : ప్రజాస్వామ్య ప్రక్రియలో యువత భాగస్వామ్యాన్ని మరింత పెంచడమే లక్ష్యంగా కేంద్ర ఎన్నికల సంఘం చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఇకపై 17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ముందస్తుగానే (అడ్వాన్స్డ్‌ అప్లికేషన్‌) ఓటరు జాబితాలో పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని కల్పించింది. అయితే, ముందస్తుగా దరఖాస్తు చేసుకున్నప్పటికీ, వారికి 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే తుది ఓటరు జాబితాలో పేరు నమోదు కావడంతో పాటు ఓటు హక్కు లభిస్తుంది.

మారిన నిబంధనలు

గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. కేవలం జనవరి 1 నాటికి 18 ఏళ్లు పూర్తి చేసుకున్న వారికి మాత్రమే ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉండేది. జనవరి 2న 18 ఏళ్లు నిండినా.. ఓటరుగా నమోదు కావడానికి మరో ఏడాది పాటు వేచి చూడాల్సి వచ్చేది. యువత ఎదుర్కొంటున్న ఈ ప్రధాన సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రజాప్రాతినిధ్య చట్టంలో కీలక సవరణలు తీసుకొచ్చింది. దీని ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం సంవత్సరానికి నాలుగు అర్హత తేదీలను అందుబాటులోకి తెచ్చింది. జనవరి 1, ఏప్రిల్‌ 1, జూలై 1, అక్టోబర్‌ 1 ఈ నాలుగు తేదీల్లో ఏదో ఒక తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండే యువత, తాము 18 ఏళ్లు నిండడానికి కొన్ని నెలల ముందే ఫారం 6 ద్వారా ముందస్తుగా దరఖాస్తు చేసుకోవచ్చు.

యువతా మేలుకో..

కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న ఈ నిర్ణయంతో జిల్లాలో సుమారు 25 వేల మందికి పైగా యువతకు సరికొత్తగా ఓటరుగా మారే అవకాశం లభించనుంది. జిల్లాలోని విద్యాసంస్థల గణాంకాలను పరిశీలిస్తే, 2023–24 పదో తరగతి విద్యార్థులు 22,500 మంది, ఇందులో బాలురు 10 వేల మంది, బాలికలు 12,500 మంది, మధ్యలో చదువు మానేసిన వారు (8, 9 తరగతులు), ఇతరులు 2,500 మంది మొత్తం 25,000 మంది ఉన్నట్లు అంచనా. 2023–24 విద్యాసంస్థల్లో పరీక్షలు రాసే సమయానికి 15 ఏళ్లు నిండిన విద్యార్థుల వయస్సు 2026 నాటికి 17 ఏళ్లకు చేరుకుంటుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం, డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న వేలాది మంది విద్యార్థులు ఇప్పుడు 17 నుండి 18 ఏళ్ల వయస్సు గ్రూపులోకి వస్తున్నారు.

17 ఏళ్లకే ఓటరుగా

ముందస్తు దరఖాస్తు

కళాశాలల్లోనే ప్రత్యేక శిబిరాలు

17 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఓటరుగా నమోదు చేసుకోవడానికి తమ వయస్సు, నివాస ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తులను క్షేత్ర స్థాయిలో బీఎల్‌ఓలు పరిశీలిస్తారు. వారు ధ్రువపత్రాలను ఆన్‌న్‌లైన్‌, వ్యక్తిగతంగా పరిశీలించిన తర్వాత, అర్హులకు ఓటు హక్కు ఇవ్వాలా లేదా అనేది నిర్ణయిస్తారు. దరఖాస్తు ప్రక్రియ 17 ఏళ్లకే ప్రారంభమైనప్పటికీ, సదరు యువతకు 18 ఏళ్లు పూర్తిగా నిండిన తర్వాతే వారి పేర్లు తుది ఓటరు జాబితాలో ప్రచురితమవుతాయి. ఈ సరికొత్త విధానంపై అవగాహన పెంచడానికి జిల్లాలోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లోనే ప్రత్యేక నమోదు శిబిరాలను నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ సులభతరమైన ముందస్తు దరఖాస్తు ప్రక్రియ వల్ల జిల్లాలో ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement