అదాబ్బా సంగతి! | - | Sakshi
Sakshi News home page

అదాబ్బా సంగతి!

Jul 12 2026 11:58 PM | Updated on Jul 12 2026 11:58 PM

బంగారుపాళ్యం – పూతలపట్టు జాతీయ రహదారిపై ఇష్టారాజ్యం అర్ధరాత్రి దాటినా జోరుగా సాగుతున్న దాబాల నిర్వహణ మద్యం తాగి తూగుతున్న వైనం పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు మామూళ్ల మత్తులో కొందరు అధికారులు హైవే పెట్రోలింగ్‌ శూన్యం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: జాతీయ రహదారిపై ప్రయాణమంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. నిబంధనలకు విరుద్ధంగా, ఇష్టారాజ్యంగా నడుస్తున్న పలు దాబాల నిర్వహణతో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంగా మారింది. బంగారుపాళ్యం నుంచి పూతలపట్టు వరకు హైవే దారి పొడవునా వెలసిన కొన్ని దాబాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అర్ధరాత్రి దాటినా జోరుగా సాగుతున్న ఈ దందాపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మందుబాబుల హల్చల్‌

రాత్రి వేళల్లో పలు దాబాల వద్ద పరిస్థితి దారుణంగా ఉంటోంది. నిబంధనల ప్రకారం నిర్ణీత సమయానికి దాబాలు మూసివేయాల్సి ఉన్నా, ఇక్కడ మాత్రం ఆ పరిస్తితి లేదు. పలు దాబాల్లో బహిరంగంగానే మ ద్యం సరఫరా జరుగుతుండడంతో, మందు బాబులు ఇష్టానుసారంగా తాగి తూగుతూ రోడ్లపైకి వస్తున్నా రు. హైవేపై వాహనాలు వేగంగా దూసుకెళ్లే క్రమంలో, ఈ మందుబాబుల నిర్వాకం వల్ల తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికుల చెబుతున్నారు. దీనికి తోడు నిర్మానుష్య ప్రాంతాల్లో ఉన్న డాబాల పరిసరాల్లో దోపిడీలు, దొంగతనాలు సైతం పెరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

హైవే పెట్రోలింగ్‌ ఎక్కడ?

ఈ దారిలో రక్షణ కల్పించాల్సిన హైవే పెట్రోలింగ్‌ వ్యవస్థ పూర్తిగా నిరుపయోగంగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో పోలీసులు నిఘా ఉంచకపోవడంతోనే దాబా నిర్వాహకులు బరితెగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. హైవే వెంబడి బంగారుపాళ్యం పరిధిలోనే సుమారు 20 దాబాలు, పూతలపట్టులో 10, కాణిపాకం పరిధిలో 6 దాబాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిలో అత్యధిక శాతం దాబాల్లో ఎలాంటి అనుమతులు లేకుండానే అక్రమంగా వ్యాపారాలు సాగిస్తున్నారు.

మామూళ్ల మత్తులో అధికారులు?

ఇంత జరుగుతున్నా యంత్రాంగం కదలకపోవడం వెనుక మామూళ్ల కథ నడుస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు అధికారులు ఈ దాబా నిర్వాహకుల నుంచి నెలవారీ ప్యాకేజీలు పుచ్చుకుని, అటువైపు కన్నెత్తి చూడడం లేదని సమాచారం. ప్రజలు, వాహనదారుల నుంచి పలుమార్లు ఫిర్యాదులు వెళ్లినప్పటికీ.. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడం వెనుక ఉన్న మర్మమేంటో అర్థం కావడం లేదని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న దాబాలపై ఉక్కుపాదం మోపకపోతే.. మున్ముందు మరిన్ని ప్రాణాలు గాల్లో కలవడం ఖాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement