చిత్తూరు అర్బన్: వినాయక చవితి నేపథ్యంలో ప్లాస్టరాఫ్ పారిస్ విగ్రహాలను చెరువుల్లో వేయకుండా నిషేధించడంపై కలెక్టర్ సుమిత్‌కుమార్ దృష్టి సారించారు. చిత్తూరులోని కట్టమంచి చెరువులో ప్రతి ఏటా వినాయక ప్రతిమలు నిమజ్జనం చేయడం.. అందులోనూ 90 శాతం విగ్రహాలు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (పీఓపీ)తో చేయడం కావడంతో అవి నీళ్లలో కరిగిపోకుండా చెరువును కాలుష్యపూరితం చేస్తున్నాయి. దీనిపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో కలెక్టర్ స్పందించారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ పీఓపీ విగ్రహాలను చెరువుల్లో వేయడానికి వీల్లేదని, చెరువును కబళిస్తున్న పీఓపీ విగ్రహాలను తొలగించాలని మునిసిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్‌ను ఆదేశించారు. దీనిపై అధికారులు కార్యాచరణకు సిద్ధమవుతున్నారు.


