ఓటర్ల డేటా హైజాక్‌ | - | Sakshi
Sakshi News home page

ఓటర్ల డేటా హైజాక్‌

Jul 12 2026 1:53 AM | Updated on Jul 12 2026 1:53 AM

ఐ టీడీపీ యాప్‌లోకి సర్‌ ఎన్యూమరేషన్‌ ఫారాలు ఎన్నికల సంఘం నిబంధనలు గాలికి, తమ్ముళ్ల చేతుల్లో సర్‌ ఫైళ్లు ఎన్నికల రికార్డా? టీడీపీ సొత్తా ? రహస్య డేటా ప్రైవేట్‌ యాప్‌లోకి ఎలా? మంత్రి లోకేష్‌ పేరుతో క్షేత్రస్థాయిలో బీఎల్వోలకు టీడీపీ నేతల హుకుం

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : ఎన్నికల సంఘం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సర్‌’ ప్రక్రియలో లోపాలను సరిదిద్ది పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయాల్సి ఉంది. అయితే అధికార పార్టీ నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ మొత్తం వ్యవస్థను ప్రైవేటు పరం చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా జిల్లాలోని గుడిపాల మండలానికి చెందిన ఒక ఘటన సాక్ష్యాలతో సహా బయటపడింది. ఈనెల 10 వ తేదీన సదరు మండలానికి చెందిన టీడీపీ నేత హేమాద్రి స్థానిక వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టిన ఒక పోస్ట్‌ ఇప్పుడు జిల్లావ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఆ మండలంలోని రామభద్రాపురం పోలింగ్‌ కేంద్రం (నెంబర్‌ 197)లో 99.3 శాతం ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాలను విజయవంతంగా డిజిటలైజేషన్‌ చేశారని, ఇందుకు సహకరించిన బీఎల్వో సురేష్‌ చాలా బాగా పనిచేశాడంటూ సదరు నాయకుడు కితాబు ఇచ్చారు. అసలు ట్విస్ట్‌ ఇక్కడే ఉంది. ఈ డిజిటలైజేషన్‌ జరిగింది ప్రభుత్వ అధికారిక పోర్టల్‌లోనో, ఎన్నికల సంఘం యాప్‌లోనో అనుకుంటే పొరపాటే. ఓటర్ల నుంచి సేకరించిన అత్యంత రహస్యమైన ఎన్యూమరేషన్‌ ఫారాల్లోని సమాచారాన్ని అధికారిక వ్యవస్థ కంటే ముందే ‘ఐ టీడీపీ’ యాప్‌లో నమోదు చేశారనేది సదరు వాట్సాప్‌ సందేశం ద్వారా స్పష్టమవుతోంది. అధికారుల వద్ద ఉండాల్సిన ఫారాలు టీడీపీ నాయకుల చేతుల్లోకి ఎలా వెళ్తున్నాయనే ప్రశ్నకు ఈ ఘటనే ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తోంది.

ఎన్నికల సంఘం

నిబంధనలకు విలువ లేదా?

రాజ్యాంగబద్ధంగా సాగాల్సిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను టీడీపీ తన యాప్‌తో నియంత్రించాలని చూడడంపై పలు గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఓటర్ల నివాస వివ రాలు వంటి సున్నితమైన సమాచారాన్ని అధికార పార్టీ అక్రమంగా ప్రొఫైలింగ్‌ చేయడానికి ఈ డేటాను వాడుకుంటోందని ఆరోపిస్తున్నారు. సానుభూతిపరులు కాని ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ఈ సమాచారాన్ని ఒక సాధనంగా వాడుకునే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా జూలై 14 లోగా సర్‌ ఫారాల డిజిటలైజేషన్‌ పూర్తి చేయా లని ఎన్నికల అధికారులు గడువు విధించగా.. ప్రభుత్వ యంత్రాంగం కంటే ముందే అధికార పార్టీ నేతలు ఈ ఫారాలను తమ యాప్‌లలో నమోదు చేసుకునేందుకు బూత్‌ బూత్‌కూ రంగంలోకి దిగడం గమనార్హం. ఈ డేటా హైజాక్‌ పై కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తక్షణమే స్పందించి, విచారణ జర పాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను ప్రైవేట్‌ యాప్‌ల ద్వారా హైజాక్‌ చేస్తున్న వారిపై, బీఎల్వోలను బెదిరిస్తున్న నాయకులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తికే ముప్పు వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

అత్యంత పారదర్శకంగా సాగాల్సిన కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక ఓటర్ల సంక్షిప్త సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌) కార్యక్రమం పక్కదారి పడుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో ప్రభుత్వ యంత్రాంగం డిజిటలైజేషన్‌ చేయాల్సిన ఓటర్ల ఎన్యూమరేషన్‌ ఫారాల డేటా.. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన ‘ఐ టీడీపీ’ యాప్‌లోకి చేరుతుండడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో బూత్‌ లెవెల్‌ అధికారులు, (బీఎల్వో) లను బెదిరించి, బలవంతంగా ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని అధికార పార్టీ నాయకులు గుంజుకుంటున్నారనే ఆరోపణలు విమర్శలకు దారితీస్తున్నాయి.

లోకేష్‌ పేరుతో హుకుం..

జిల్లా వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో ఉన్న బూత్‌ లెవెల్‌ అధికారులు (బీఎల్వోలు)పై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఓటర్ల ఇళ్ల నుంచి సేకరించిన అన్ని సర్‌ ఎన్యూమరేషన్‌ ఫారాలను ముందుగా తమకే ఇవ్వాలంటూ టీడీపీ స్థానిక నేతలు హుకుం జారీచేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఫారాలు ఇవ్వలేమని నిరాకరిస్తున్న బీఎల్వోలను అధికార బలంతో భయభ్రాంతులకు గురిచేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ‘మాట వినకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు చెబుతాం.. మీ ఉద్యోగాలతో ఆటలాడుకుంటాం’ అంటూ క్షేత్రస్థాయిలో కొందరు నేతలు హల్‌చల్‌ చేస్తుండడంతో బీఎల్వోలు బెంబేలెత్తిపోతున్నారు. టీడీపీ స్థానిక నాయకులు బీఎల్వోలపై తీవ్రమైన మానసిక ఒత్తిడి తెస్తున్నారని పలు ఉద్యోగ సంఘాలు అంతర్గతంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement