వేరుశనగ విత్తనాలపై ముందుగానే చేతులెత్తేసిన వ్యవసాయశాఖ.. అన్నదాతకు తప్పని అగచాట్లు జూలై 11 దాటినా అంతులేని ఎదురుచూపులు సాధారణ విస్తీర్ణం 21,903 హెక్టార్లు సాగైంది మాత్రం కేవలం 93 హెక్టార్లే విత్తనాలపై స్పష్టత ఇవ్వాలని రైతుల డిమాండ్
చిత్తూరు రూరల్(కాణిపాకం): జిల్లాలో రాయితీ వేరుశనగ విత్తనాల పంపిణీపై ఎల్‌నినో నీలినీడలు కమ్ముకున్నాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావం గట్టిగా ఉంటుందని, వర్షాలు పడవని, కాబట్టి వేరుశనగ విత్తన కాయలు ఇవ్వడం అనుమానమేనంటూ గతంలో వ్యవసాయ అధికారులు చెప్పిన ముందస్తు హెచ్చరికలు ఇప్పుడు అక్షరాలా నిజమవుతున్నాయి. అధికారులు చెప్పిన ఆ చేదు నిజం ఇప్పుడు రైతుల పాలిట శాపంగా మారింది. సీజన్ ముదురుతున్నా జిల్లాకు ఆశించిన స్థాయిలో వేరుశనగ కాయలు రాని పరిస్థితి నెలకొంది. వ్యవసాయశాఖ ముందస్తు ప్రణాళికలు వేయడంలో పూర్తిగా విఫలం కావడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.
కాయలు కాసేలా.. ఎదురుచూపులు
ప్రతి ఏటా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలోనే వేరుశనగ రాయితీ విత్తనాలను పంపిణీ చేసేవారు. కానీ, ఈసారి జూలై 11వ తేదీ దాటిపోతున్నా విత్తన కాయల ఊసే లేదు. జిల్లాకు 27వేల క్వింటాళ్ల కాయలు కేటాయిస్తే...కుప్పం, పలమనేరు నియోజకవర్గాలకు కలిపి కేవలం 6 వేల క్వింటాళ్ల కాయలు మాత్రమే వచ్చాయని అధికారులు నోటిమాటగా చెబుతున్నా, క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇక మిగిలిన నియోజకవర్గాల రైతులకు మాత్రం మొండిచేయి మిగిలింది. పల్లెల్లో రైతులు విత్తన కాయల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. సాగు కోసం చాలా మంది రైతులు అప్పులు తెచ్చి మరీ దుక్కులు దున్ని సిద్ధం చేసుకున్నా.. అధికారులు మాత్రం అదిగో వస్తున్నాయి.. ఇదిగో వస్తున్నాయి అంటూ కాలయాపన చేస్తూ బూచి చూపిస్తున్నారు. విత్తనాలు రావని ముందే గ్రహించిన కొందరు రైతులు.. తప్పనిసరి పరిస్థితుల్లో తాము నిల్వ ఉంచుకున్న కాయలను లేదా ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి అధిక ధరలకు కొనుగోలు చేసి విత్తుకున్నారు. మరికొందరు విత్తనాలు లేక దుక్కి దున్నిన పొలాలను అలాగే వదిలేశారు.
సాగు కుదేలు
జిల్లాలో వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 21,903 హెక్టార్లు కాగా, విత్తనాల కొరత, వర్షా భావం కారణంగా ఈసారి ఇప్పటివరకు కేవలం 93 హెక్టార్లలో మాత్రమే సాగు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇంత జరుగుతున్నా వ్యవసాయశాఖ అధికారులు మాత్రం.. ఎల్‌నినో ఎఫెక్ట్ ఉందంటూ, వర్షాలు పడవు కాబ ట్టి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలంటూ ఉచిత సలహాలు ఇస్తూ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాయితీ విత్తనాలు ఇస్తారా? లేదా? అనే విషయాన్ని అధికారులు స్పష్టంగా చెబితే, తాము ఇతర పంటలైనా వేసుకుంటామని, కాలం దాటిపోతే దేనికీ పనికిరాకుండా పోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు నోరు విప్పి, రాయితీ విత్తనాల పంపిణీపై స్పష్టత ఇవ్వాలని, అన్నదాతలను ఆదుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.


