ప్రారంభం నుంచే మామిడి రైతులకు సబ్సిడీ | - | Sakshi
Sakshi News home page

ప్రారంభం నుంచే మామిడి రైతులకు సబ్సిడీ

Jul 11 2026 12:42 AM | Updated on Jul 11 2026 12:42 AM

● త్వరలో గ్రామ సభల షెడ్యూల్‌ జారీ ● అర్హులందరికీ సబ్సిడీ అందేలా పకడ్బందీగా కసరత్తు ● విలేకరులతో కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ వెల్లడి

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా సీజన్‌ ప్రారంభం నుంచి పరిశ్రమలకు మామిడి తోలిన రైతులందరికీ ప్రభుత్వ సబ్సిడీ అందజేస్తారని కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ గాంధీ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సబ్సిడీ పంపిణీలో ఎలాంటి అవకతవకలకు తావు లేదన్నారు. త్వరలో జిల్లా వ్యాప్తంగా సబ్సిడీకి సంబంధించి గ్రామ సభల నిర్వహణకు షెడ్యూల్‌ జారీ చేస్తామన్నారు. ఆ గ్రామ సభల్లో క్షేత్రస్థాయి పరిశీలన, గత ఏడాది రైతుల వివరాలు, రైతుల ధ్రువీకరణ, పంట ఈకేవైసీ నమోదు పకడ్బందీగా పరిశీలిస్తారన్నారు. క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాతనే అర్హులైన రైతులను గుర్తిస్తామన్నారు. అంతర్జాతీయ పరిస్థితులు, ఎగుమతుల మందగమనం, పల్ప్‌ పరిశ్రమల్లో కొనుగోళ్లు తగ్గిపోవడంతో మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లగా కనీస మద్దతు ధర రూ.4 ప్రకటించారన్నారు. జిల్లాలో సుమారు 51,736 హెక్టార్లలో తోతాపురి సాగు జరుగుతోందన్నారు. దక్షిణ భారతదేశంలో మామిడి గుజ్జు తయారీ, ఎగుమతులకు చిత్తూరు జిల్లా ప్రధాన కేంద్రంగా ఉండటంతో దాదాపు 35 వేల రైతు కుటుంబాలు ఈ పంటపైనే ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. తోతాపురి రకం కేవలం గుజ్జు (పల్ప్‌) తయారీకే అనువైనందున, పరిశ్రమలు కొనుగోళ్లు తగ్గించడంతో రైతులకు నష్టం కలుగుతోందన్నారు.

జిల్లాలో కేంద్ర నిపుణుల బృందం అధ్యయనం

జిల్లాలో తోతాపూరి మామిడి సాగు సమస్యలను అధ్యయనం చేసి శాశ్వత పరిష్కారాలను సూచించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఆదేశాల మేరకు భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి నియమించిన కేంద్ర నిపుణుల బృందం శుక్రవారం జిల్లాలో పర్యటించిందన్నారు. లక్నో ఐసీఏఆర్‌–సిఐఎస్‌హెచ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ టి. దామోదరన్‌ నేతృత్వంలోని ఈ బృందంలో బెంగళూరు ఐఐహెచ్‌ఆర్‌ హెడ్‌ డాక్టర్‌ ఎం. శంకరన్‌, లక్నో ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ హెచ్‌.ఎస్‌. సింగ్‌, అనంతరాజుపేట హార్టికల్చర్‌ కాలేజ్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ డి.శ్రీనివాస రెడ్డి, ఏపీ ఉద్యానశాఖ ప్రతినిధులు సభ్యులుగా ఉన్నారన్నారు. ఈ కేంద్ర బృందం జిల్లాలోని రైతులు, అధికార యంత్రాంగం, మామిడి పల్ప్‌ పరిశ్రమల ప్రతినిధులు, ఎగుమతిదారులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిస్థితులను పరిశీలిస్తుందన్నారు. మామిడి ఉత్పత్తులకు డిమాండ్‌ పెంపు, నాణ్యత మెరుగుదల, ఎగుమతుల విస్తరణ, మార్కెటింగ్‌ విధానాలు, ప్రాసెసింగ్‌ పరిశ్రమల పనితీరుపై సమగ్ర అధ్యయనం చేస్తారన్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోనూ ఈ బృందం పర్యటించి, రైతులకు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూర్చే విధానాల రూపకల్పనకు అవసరమైన సూచనలు చేస్తుందని కలెక్టర్‌ వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement