పలమనేరు: జిల్లాలో మల్బరీ సాగును మరింతగా పెంచేలా చర్యలు తీసుకుంటున్నామని పట్టు పరిశ్రమ శాఖ సంయుక్త సంచాలకులు వాణి పేర్కొన్నారు. పలమనేరు పట్టుగూళ్ల మార్కెట్‌ను శుక్రవారం ఆమె సందర్శించారు. ఈసందర్భంగా అక్కడున్న రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనే పట్టుపురుగుల సాగులో పలమనేరుకు ప్రాధానన్యత ఉందన్నారు. ఇందులో భాగంగా స్థానిక మార్కెట్‌లో ధరలు ఆశాజనంగా ఉండేందుకు మరిన్ని రీలింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఆసక్తి ఉన్న వారికి ట్విస్టింగ్ యూనిట్లను మంజూరు చేస్తామన్నారు. పట్టు రైతులకు గతంలో ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ ప్రోత్సాహకాలను ఇస్తూ మల్బరీ సాగును పెంచుతామన్నారు. ఇక్కడి పట్టు రైతులు, వ్యాపారులు, అధికారులతో త్వరలో ఓ సమావేశాన్ని నిర్వహించి రైతులనుంచి సలహాలు, సమస్యలు తెలుసుకుంటామన్నారు. వాటిని తమశాఖ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్ళి జిల్లాలో మళ్లీ పట్టు పరిశ్రమకు పూర్వ వైభవాన్ని తీసుకొవచ్చేలా ప్రయత్నం చేస్తామన్నారు. ఈసందర్భంగా పట్టు రైతు ఏడూరు గురుమూర్తి శెట్టి పలు విషయాలను రైతుల తరఫున ఆమెకు విన్నవించారు. ఇందులో స్థానిక ఏడీ సరోజా తదితరులు పాల్గొన్నారు.


