ఆకాశంలో కారుమబ్బుల దోబుచూలాట
భూమిలోపల పడని విత్తు
పాతాళానికి పడిపోతున్న భూగర్భ జలాలు
పొంచివున్న కరువు ముప్పు
కాణిపాకం: వర్షం కోసం అన్నదాత ఆకాశం వైపు చూస్తున్నా వరుణుడు కనికరించడం లేదు. కారు మబ్బులు కమ్ముకుంటున్నా నీటి చుక్కను జారవిడవడం లేదు. జిల్లాపై ఎల్‌నినో ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. వరుణుడు ఈదురు గాలులు, మేఘాల గర్జనలతో సరిపెడుతున్నాడు. నేలను తడపడానికి మాత్రం మనసు చేసుకోవడం లేదు. సాధారణంగా జూలై నెల వచ్చిందంటే చాలు చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోవాలి. ఈ ఏడాది పరిస్థితి అందుకు భిన్నంగా మారింది. ఏటా జూలై లో 103 మి.మీల. సగటు వర్షపాతం నమో దు కావాల్సి ఉండగా, ఈ సారి జూలై సగానికి వచ్చినా 52.70 మి.మీల వద్దే వర్షపాతం నిలిచిపోయింది. అంటే సగటులో సగానికి పైగా లోటు పీడిస్తోంది.
పడిపోనున్న సాగు విస్తీర్ణం
జిల్లాలో ఎక్కువ మంది ప్రజలు వ్యవసాయం, పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాలు లేకుంటే సాగు విస్తీర్ణం ఘననీయంగా పడిపోయే అవకాశాలున్నా యి. ఇప్పటికే వర్షాలు లేక పంటలు పండించే రైతుల సంఖ్య తగ్గిపోయింది. ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి మరింత సాగు విస్తీ ర్ణం పడిపోనుంది. ఈ సమయానికి సాగులోకి రావాల్సిన పంటలు వెనకడుగు వేస్తోంది.
భూమిలోనే చిత్తవుతున్న విత్తు
వానలు పడతాయనే ఆశతో కొంతమంది రైతన్నలు పొలాలను దుక్కిదున్ని విత్తనాలు వేశారు. ఇంకా అనేక మంది విత్తు విత్తేందేకు ఎదురుచూస్తున్నారు. తీరా చూస్తే వరుణుడు కరుణించడం లేదు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు పెద్దగా ఉండకపోవచ్చని అధికారులు తేల్చి చెబుతుండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. సకాలంలో తడి తగలక.. వేసిన విత్తు భూమిలోనే చిత్తయిపోతోంది. ఈ నేపథ్యంలో జిల్లాను కరువు కాటకాలు కమ్ముకునే ప్రమాదం ముంచుకొస్తోందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రభు త్వం తక్షణమే స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని కోరుతున్నారు.
పాతాళానికి గంగ
వర్షాలు మొఖం చాటేయడంతో భూగర్భ జలాలు అంతకంతకూ అడుగంటిపోతున్నాయి. గంగ పాతాళానికి పడిపోతోంది. గత ఏడాది డిసెంబర్‌లో 6.87 మీటర్ల వద్ద ఉన్న భూగర్భ నీటిమట్టం ఈ ఏడాది జనవరి నుంచి పడిపోతూ వస్తోంది. జనవరిలో 8.42 మీటర్లకు పడిపోగా.. ఫిబ్రవరిలో 9.84 మీటర్లు, మార్చిలో 10.96 మీటర్లు, ఏప్రిల్‌లో 12.93 మీటర్లు, మే నెలలో 13.82 మీటర్లు, జూన్ ముగిసే సరికి ఏకంగా 14.24 మీటర్ల లోతుకు పడిపోయింది. రానున్న రోజుల్లోనూ వర్షాలు పడకపోతే ఈ సంక్షోభం మరింత పెరు గుతుందని అధికారులు చెబుతున్నారు. బావులు, బోర్లు ఎండిపోయి తాగునీటి ఎద్దడి కోరలు చాచడం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖం చాటేసిన
వానదేవుడు
జూలై సాధారణ నమోదైన
(సంవత్సరం) వర్షపాతం వర్షపాతం
2021 103 మి.మీ 223.10 మి.మీ
2022 103 మి.మీ 77.90 మి.మీ
2023 103 మి.మీ 62.70 మి.మీ
2024 103 మి.మీ 90.10 మి.మీ
2025 103 మి.మీ 93.40 మి.మీ
2026(ప్రస్తుతం) 103 మి.మీ 52.70 మి.మీ(తీవ్ర లోటు)
ఇదీ వర్షపాతం
గడిచిన ఐదేళ్లలో జూలైలో నమోదైన వర్షపు గణంకాలను పరిశీలిస్తే.. జిల్లాలో వానల గ్రాఫ్ ఏటా ఎలా పడిపోతుందో అర్థమవుతోంది.


