రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి వ్యక్తి మృతి

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

● ద్విచక్ర వాహనం ధ్వంసం ● పోలీసుల వద్దకు చేరిన పంచాయితీ

కుప్పం రూరల్‌ : కుప్పం – గుడుపల్లె రైల్వే మార్గంలో డంపింగ్‌ యార్డు వద్ద గురువారం రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందినట్టు కుప్పం రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని, నీలి రంగు షర్టు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని కుప్పం ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు చెప్పారు. వివరాలు తెలిస్తే కుప్పం రైల్వే పోలీసులు 8074088806 నంబరుకు సమాచారం ఇవ్వాలని కోరారు.

లారీ బోల్తా

కుప్పం రూరల్‌ : కుప్పం మండలం, నడుమూ రు అటవీ ప్రాంతంలో గురువారం లారీ బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు.. లారీ పత్తి లోడుతో గుజరాత్‌ రాష్ట్రం నుంచి తమిళనాడు రాష్ట్రం ఈరోడ్డుకు వెళుతోంది. కుప్పం – క్రిష్ణగిరి జాతీ య రహదారిలోని నడుమూరు మోడ ల్‌ స్కూల్‌ మలుపు వద్ద అదుపు తప్పి బోల్తాపడింది. ప్రమాదంలో లారీ డ్రైవర్‌, క్లీనర్‌ స్వల్పంగా గాయపడ్డారు. లారీ చాలా వరకు దెబ్బతిందని, డ్రైవర్‌, క్లీనర్‌ వివరాలు తెలియరాలేదని స్థానికులు చెప్పారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

హంతకుడి కోసం

ముమ్మర గాలింపు

విజయపురం (నగరి): విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి జరిగిన వివాహిత హత్య కేసులో నిందితుడి కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న సీఐ ఎన్‌.భాస్కర్‌ పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలంలో సేకరించిన ఆధారాలు, స్థానికుల నుంచి పొందిన సమాచారం, సాంకేతిక ఆధారాల ఆధారంగా నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు పలుచోట్ల గాలింపు చేపడుతున్నారు. అనుమానితుల కదలికలను పరిశీలిస్తూ, వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. హత్యకు గల కారణాలపై సమగ్ర విచారణ చేపడుతున్నామని, నిందితుడిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

రేపు జిల్లా వ్యాప్తంగా

లోక్‌ అదాలత్‌

చిత్తూరు అర్బన్‌: ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న న్యాయస్థానాల్లో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి భారతి తెలిపారు. ఇందులో రాజీ చేసుకోదగ్గ కేసులను పెద్ద సంఖ్యలో పరిష్కరించేలా కక్షిదారులు, న్యాయవాదులు, పోలీసు, బీమా, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల అధికారులు సహకరించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 14 న్యాయస్థానాల్లో ప్రత్యేక అదాలత్‌ బెంచ్‌లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

పార్కింగ్‌ విషయంలో గొడవ

చిత్తూరు అర్బన్‌: ద్విచక్ర వాహనం పార్కింగ్‌ విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. చివరకు పంచాయితీ పోలీసుల వద్దకు చేరింది. టూ టౌన్‌ సీఐ నెట్టికంటయ్య కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని గిరింపేట మసీదు మిట్టకు చెందిన పద్మిని ఈ నెల ఒకటవ తేదీన తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి వద్ద నిలిపింది. వాహనాన్ని తమ ఇంటి ఎందుకు నిలిపారంటూ ఎదురుగా కాపురం ఉన్న కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగారు. ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరి పద్మిని ద్విచక్ర వాహనాన్ని ఎదురింటి వారు ధ్వంసం చేశారు. బాధితురాలు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

యువకునిపై పోక్సో కేసు

పలమనేరు: గంగవరం మండలానికి చెందిన ఓ యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు సీఐ రాంభూపాల్‌ గురువారం తెలిపారు. మండలంలోని కల్లుపల్లికి చెందిన వినోద్‌ అనే యువకుడు రెండు రోజుల క్రితం ఓ బాలికకు మాయ మాటలు చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితునిపై గురువారం పోక్సో కేసు నమోదు చేశారు. నిందితుడు పరారీలో ఉండడంతో అతనికోసం పోలీసులు వెతుకుతున్నారు.

ఉత్తర్వులు ఇవ్వడానికి వెళ్లి..

తవణంపల్లె(ఐరాల): తవణంపల్లె మండలంలోని దిగువ తడకరలో గురువారం చిత్తూరు జిల్లా కోర్టులో పనిచేస్తున్న అమీనా జనార్దన్‌ (43) మృతి చెందాడు. ఆయన గురువారం కోర్టు ఉత్తర్వులు అందజేసేందుకు తవణంపల్లె మండలం దిగువ తడకరకు చెందిన సుమన్‌ ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో ఆయన ఇంటి వద్ద అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి కింద పడిపోయాడు. స్థానికులు వెంటనే అరగొండ అపోలో ఆస్పత్రికి తరలించారు. డ్యూటీ డాక్టర్‌ పరీక్షించి అప్పటికే మృతి చెందినట్టు నిర్ధారించారు. మృతుడి భార్య లావణ్య ఫిర్యాదు మేరకు తవణంపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement