రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం | - | Sakshi
Sakshi News home page

రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

Jul 10 2026 5:22 AM | Updated on Jul 10 2026 5:22 AM

● స్పష్టత లేని సమాధానం ● మీడియాతో ఆర్పీఎఫ్‌ వాగ్వాదం

చిత్తూరు కార్పొరేషన్‌: గుంతకల్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) చంద్రశేఖర్‌గుప్తా గురువారం చిత్తూరు రైల్వేస్టేషన్‌ను తనిఖీ చేశారు. అమృత్‌ భారత్‌ కింద స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఒకటో నంబర్‌ ప్లాట్‌ఫాం, టికెట్‌ కౌంటర్‌, ప్రవేశ మార్గం, పార్కింగ్‌ ప్రాంతాలు, నూతన భవనంను చూశారు. ఆయన మాట్లాడుతూ రైల్వేస్టేషన్‌ను అన్ని హంగులతో తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. డిసెంబర్‌లోపు పనులు పూర్తవుతాయని తెలిపారు. స్టేషన్‌లో వెయిటింగ్‌హాల్స్‌, ఏసీ విశ్రాంతి గదులు, దివ్యాంగులకు మరుగుదొడ్లు, వాహనాల పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. గుంతకల్‌ డివిజన్‌ పరిధిలో 16 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్టు తెలిపారు. చిత్తూరు హైరోడ్డులోని పెట్రోల్‌ బంక్‌ లీజు సమయం ముగియడంతో స్థలాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అనంతరం నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు.

స్పష్టత లేని సమాధానం

ఈ సందర్భంగా చిత్తూరు నుంచి వెళ్తున్న 6 రైళ్లు ఇక్కడ ఆగడం లేదని మీడియా ప్రతినిధులు డీఆర్‌ఎం దృష్టికి తీసుకువచ్చారు. అలాగే చిత్తూరు వాసుల కల అయిన చైన్నెకు నేరుగా రైలు ఎప్పుడు వస్తుందని అడిగారు. వీటిపై డీఆర్‌ఎం సరైన సమాధానం చెప్పలేదు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానని దాటవేశారు.

మీడియాతో ఆర్పీఎఫ్‌ వాగ్వాదం

మీడియా ప్రతినిధులపై ఆర్పీఎఫ్‌ కానిస్టేబుళ్లు అతిగా ప్రవర్తించారు. వాహనాలను పార్కింగ్‌లోనే పెట్టాలని ఆదేశించారు. డీఆర్‌ఎం స్టేషన్‌లో పర్యటిస్తుండగా కవర్‌ చేస్తున్న విలేకర్లతో అనుచితంగా వ్యవహరించారు. మీడియా అని చెబితే అయితే ఏమి అంటూ మాట్లాడారు. దీనిపై మీడియా ప్రతినిధులు తిరగబడడంతో సీఐ రవిశంకర్‌, ఏఎస్‌ఐ అశోక్‌ కలుగజేసుకుని సర్దిచెప్పారు. డీఆర్‌ఎం పర్యటనపై ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా, కవరేజ్‌ కోసం వచ్చిన వారిపై ఇలా నడుచుకోవడం సరికాదని విలేకరులు అసహనం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్టేషన్‌ మేనేజర్‌ ముత్తుస్వామి, కమర్షిషయల్‌ మేనేజర్‌ అతీషయ, జీఆర్‌పీ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement