చిత్తూరు కార్పొరేషన్: నకిలీ మెడికల్ పత్రాలతో జెడ్పీలో పలువురు కారుణ్య నియామకాలు పొందారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చంద్రలేఖ అనే యువతి ఆరోపించారు. ఆమె గురువారం జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ధర్నాకు అనుమతి లేదని పోలీసులు ఆమెను వారించారు. ఆమె సీఈఓను కలిసి ఫిర్యాదు చేశారు. ఆమె మాట్లాడుతూ తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని సొరకాయపాళ్యం జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో అటెండర్‌గా పనిచేస్తున్న జయమ్మ 2010లో క్యాన్సర్ బారిన పడిందన్నారు. చికిత్స తర్వాత వ్యాధి తగ్గిందన్నారు. అయినప్పటికీ వ్యాధి నయం కాలేదని, ఉద్యోగం చేయలేని స్థితిలో ఉన్నట్టు మభ్యపెడుతున్నట్టు ఆరోపించారు. నకిలీ మెడికల్ పత్రాలు సృష్టించి తన కొడుకు చక్రపాణికి తన ఉద్యోగం ఇప్పించిందని పేర్కొన్నారు. మెడికల్ ఇన్వాలిడేషన్ సమయంలో కూడా జయమ్మకు బదులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న మరో మహిళను వైద్యులు పరీక్షించేలా చేశారని ఆరోపించారు. తప్పుడు, నకిలీ మెడికల్ సర్టిఫికెట్లతో ఆమె కొడుకు మార్చి 2026లో వాల్మీకిపురం ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంటుగా చేరాడని వివరించారు. అక్కడి నుంచి 15 రోజుల్లోనే పలుకుబడిన ఉపయోగించి తిరుచానూరు పద్మావతి ఆలయంలో ప్రోటోకాల్ విభాగంలో డెప్యుటేషన్ వేయించుకున్నట్టు వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే నకిలీ సర్టిఫికెట్ ఇచ్చేందుకు సహకరించిన కృష్ణమూర్తి అనే వ్యక్తిపై కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై కలెక్టర్, జెడ్పీ సీఈవోకు అన్ని ఆధారాలతో ఫిర్యాదు చేశానని తెలిపారు.


