పూతలపట్టు (యాదమరి): మండలంలోని తిరుపతి–పూతలపట్టు జాతీయ రహదారిలో ఉన్న పి.కొత్తకోట వద్ద గురువారం కారు ఢీకొనడంతో మహిళ మృతిచెందింది. ఆమె భర్త తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు మండలం పోటుకనుమ గ్రామానికి చెందిన లలితమ్మ(55), ఆమె భర్త కృష్ణయ్య సొంత పనుల నిమిత్తం తిరుపతి వెళ్లారు. తిరిగి వస్తూ పి.కొత్తకోట వద్ద బస్సు దిగారు. జాతీయ రహదారి దాటుతున్న సమయంలో తిరుపతి వైపు వేగంగా వెళ్తున్న కారు ఢీకొంది. లలితమ్మ అక్కడికక్కడే మృతి చెందగా ఆమె భర్త కృష్ణయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతన్ని 108లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పూతలపట్టు సీఐ తిమ్మయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి బంధువులు, కొత్తకోట గ్రామస్తులు ఘటనా స్థలానికి చేరుకుని రోడ్డుపై టైఠాయించారు. పి.కొత్తకోట వద్ద వరుస ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే మురళీమోహన్, నాయకులు దొరబాబు అక్కడికి చేరుకుని వారితో చర్చించారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు.


