వి.కోట: మండలంలోని పట్రపల్లిలో గురువారం ఓ రైతు ఇంటి సమీపంలో తవ్వుతుండగా పురాతన వినాయకుడి రాతి విగ్రహం బయట పడింది. స్థానికుల కథనం మేరకు.. పట్రపల్లికి చెందిన రైతు సుబ్బన్న తన సొంత ఇంటి జాగాలో ఆవును కట్టేసుకునేందుకు పెద్దరాయిని నాటాలని గడ్డపారతో తవ్వాడు. ఈ క్రమంలో పురాతన రాతి వినాయకుడి విగ్రహం బయటపడింది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పూజ లు చేశారు. విగ్రహాన్ని భద్రపరచి ఆలయంలో ప్రతిష్టించాలని గ్రామ పెద్దలు, భక్తులు కోరుతున్నారు.


