ఎండిపోతున్న చెరువులు, బోర్లు 14.24 మీటర్ల లోతుకు పడిపోయిన నీటి మట్టం తాగేందుకు ‘చేతిపంపు’లకూ దిక్కులేదు కుదేలవుతున్న వ్యవసాయం
కాణిపాకం: ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేశాయి. దీంతో జిల్లాలోని చెరువులు, బావులు, బోర్లలో నీటి మట్టం వేగంగా తగ్గిపోతోంది. భూ గర్భ జలాలు అడుగంటుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పంటలు పండించేందుకు భయపడే పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. నీటి ఎద్దడిని తట్టుకోవడంతోపాటు వ్యవసాయాన్ని గట్టెక్కించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అట్టడుగుకు నీటి మట్టాలు
సాధారణంగా భూగర్భ జలాలు 8 మీటర్ల లోపలే ఉండాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే నీటి మట్టాలు పాతాళానికి చేరుకుంటున్నాయి. గడిచిన కొన్నేళ్ల జూలై నెలల గణాంకాలను పరిశీలిస్తే ఈ ఏడాది పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. 2022 జూలైలో 77.90 మి.మీ వర్షపాతం నమోదుకాగా జలమట్టం 7.96 మీటర్లుగా ఉంది. 2023 జూలైలో 62.70 మి.మీ వర్షపాతానికి జలమట్టం 9.51 మీటర్లకు పడిపోయింది. 2024 జూలైలో 90.10 మి.మీ వర్షపాతం నమోదైనా జలమట్టం 12.60 మీటర్ల లోతుకు చేరింది. 2025 జూలైలో 93.40 మి.మీ వర్షపాతానికి 11.04 మీటర్లు ఉంది. ఈ ఏడాది జూన్ నాటికి 52.70 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో 14.24 మీటర్ల అత్యంత ప్రమాదకర స్థాయికి నీటి మట్టం పడిపోయింది. అన్ని ఏళ్లలోనూ సాధారణ వర్షపాతం 103 మి.మీ (2026 జూన్‌లో 81 మి.మీ) కాగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం జలమట్టం 8 మీటర్ల లోపల ఉండాలి. గత నెలకు నీటి మట్టం ఏకంగా 14.24 మీటర్ల లోతుకు పడిపోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రానున్న రోజుల్లో ఈ స్థాయి మరింత పడిపోయే ప్రమాదం ఉందని అధికారులు, నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఎండిపోయిన 1,834 చెరువులు
జిల్లాలో ఇరిగేషన్ శాఖ రికార్డుల ప్రకారం మొత్తం 3,106 చెరువులు ఉన్నాయి. వీటి మొత్తం నీటి సామర్థ్యం 12,982.68 ఎంసీఎఫ్‌టీలు. ప్రస్తుత నీటి నిల్వలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నిల్వలతో పోలిస్తే భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. అధికారుల లెక్కల ప్రకారమే చెరువుల పరిస్థితి ఇలా ఉంది. పూర్తిగా నిండిన చెరువులు 338 ఉండగా, 75 శాతం నీరు ఉన్నవి 182 చెరువులు, 50 శాతం నీరు ఉన్నవి 292, 25 శాతం నీరు ఉన్నవి 460 చెరువులు. పూర్తిగా ఎండిపోయినవి 183 చెరువులుగా గుర్తించారు. వీటితో పాటు వేల సంఖ్యలో ఉన్న చిన్న చిన్న చెరువులు, కుంటలు జీవం కోల్పోయాయి. తద్వారా మేతలకు వెళ్లే మూగజీవులకు నీళ్లు లేక అల్లాడిపోతున్నాయి. ఇవీ కరువు కాటకాలకు సంకేతాలిస్తున్నాయి.
ఎల్‌నినో ప్రభావంతో కురవని వర్షాలు
గొంతు ఎండుతోంది
వ్యవసాయానికే కాదు.. జిల్లాలో తాగునీటికీ ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. పంచాయతీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1,490 తాగునీటి బోర్లు, 3,863 చేతిపంపులు ఉన్నాయి. వాటిలో 1,250 చేతి పంపులు–బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. ఈ క్రమంలో గ్రామాల్లో గొంతు తడుపుకునేందుకు మైళ్ల దూరం నడవాల్సిన దుస్థితి దాపురించింది. ఇక చాలా చోట్ల అద్దె ట్యాంకర్లతో తాగునీటి సరఫరా అవుతోంది. చాలీచాలని నీటితో ప్రజలు అవస్థలు పడుతున్నారు.
24 వేల వ్యవసాయ బోర్లలో నీటి కటకట
జిల్లాలో అధికారిక లెక్కల ప్రకారం 1,23,041 వ్యవసాయ ఆధారిత బోర్లు ఉండగా మరో 10 వేలకు పైగా అనధికారిక బోర్లు ఉన్నట్టు అంచనా. ప్రస్తుతం నెలకొన్న తీవ్ర నీటి ఎద్దడి వల్ల ఈ బోర్లలో ఇప్పటికే 20 శాతం (సుమారు 24 వేలకు పైగా) బోర్లు పూర్తిగా ఎండిపోయాయి. మిగిలిన దాదాపు 40 శాతం బోర్లలో నీటి మట్టం అడుగంటుతోందని, ఎప్పుడు ఏ బోరు నీరు రాకుండా ఆగిపోతుందో తెలియడం లేదని రైతులు, రైతు సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని, తాగునీటి ఎద్దడిని గట్టెక్కించడానికి ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడానికి ప్రణాళికలు రూపొందించాలని, ఉచితంగా బోర్ల తవ్వకానికి రాయితీలు, విత్తన సాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు.


