అయ్యోర్ల సర్దుబాటు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అయ్యోర్ల సర్దుబాటు ప్రారంభం

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

కొనసాగిన మండల స్థాయి కౌన్సెలింగ్‌ అదనంగా ఉన్న 250 మందికి స్కూళ్ల కేటాయింపు లీప్‌ యాప్‌లో సర్దుబాటు నియామక ఉత్తర్వులు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ల కొరతను అధిగమించేందుకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియకు బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా బుధవారం అన్ని మండలాల్లో ఎంఈవోల ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియను ఇన్‌చార్జి డీఈవో వెంకటేశ్వరరావు పర్యవేక్షించారు.

మూడు దశల్లో కౌన్సెలింగ్‌

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనల ప్రకారం పూర్తి చేసేందుకు విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బుధవారం అన్ని మండలాల్లో ప్రాథమిక కౌన్సెలింగ్‌ ప్రక్రియ కొనసాగించారు. మండల స్థాయి ప్రక్రియ ముగిసిన అనంతరం మిగిలిన టీచర్లకు డివిజన్‌ స్థాయిలో డీవైఈవో ఆధ్వర్యంలో సమీక్ష, కౌన్సెలింగ్‌ నిర్వహిస్తారు. తుది విడతగా డీవైఈవో స్థాయిలో మిగిలిన వారికి డీఈవో ఆధ్వర్యంలో సర్దుబాటు ప్రక్రియను చేపడతారు.

లీప్‌ యాప్‌లోనే డిజిటల్‌ ఉత్తర్వులు

ఈ సర్దుబాటు ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా చర్యలు చేపడుతున్నారు. కౌన్సెలింగ్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఉపాధ్యాయులకు లీప్‌ యాప్‌ ద్వారానే అధికారిక సర్దుబాటు పోస్టింగ్‌ ఉత్తర్వులు జారీ చేస్తామని ఇన్‌చార్జ్‌ డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. ఉపాధ్యాయులు తమకు కేటాయించిన పాఠశాలల్లో వెంటనే చేరాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే ఈ ప్రక్రియ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.

859 మంది అవసరం.. 250 మందితోనే సర్దుబాటు

జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నిష్పత్తికి అనుగుణంగా ఉపాధ్యాయుల అవసరం భారీగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 859 మంది స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు అవసరమని విద్యాశాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో అవసరానికి మించి అదనంగా ఉన్న 250 మంది ఉపాధ్యాయులను కొరత తీవ్రంగా ఉన్న పాఠశాలల్లోకి సర్దుబాటు చేస్తున్నారు. దీనివల్ల తాత్కాలికంగానైనా సింగిల్‌ టీచర్‌ పాఠశాలలు, ఉపాధ్యాయులు లేని పాఠశాలల్లో విద్యాబోధనకు ఆటంకం కలగకుండా చూడవచ్చని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement