చిత్తూరు రూరల్ (కాణిపాకం): వి.కోటలో బ్రహ్మకుమారీస్ సంస్థ ముసుగులో మహిళలపై అత్యాచారాలు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని, వీటిపై రాష్ట్ర ప్రభుత్వం కమిటీ ఏర్పాటుచేసి సమగ్ర విచారణ జరపాలని హైదరాబాద్‌కు చెందిన నిరాకర్ శివ పరమాత్మ ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయ సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ మంజుల కోరారు. ఆమె బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. వి.కోట మండలం ముదరందొడ్డిలో ఉన్న బ్రహ్మకుమారీస్ కేంద్రంలో జనార్దన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల జీవితాలను నాశనం చేస్తున్నాడని ఆరోపించారు. ప్రశ్నించిన బ్రహ్మకుమారి శివజ్యోతిని బెదిరిస్తున్నాడని, అతని అరాచకాలు బయటకు రాకుండా వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తంచేశారు. దీనిపై శివజ్యోతి వీకోట పోలీసులకు ఫిర్యాదు చేసినా కనీసం విచారించలేదని తెలిపారు. ఈ ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక విచారణ జరిపించాలని, బ్రహ్మకుమారీస్‌లో జరుగుతున్న అరాచకాలను వెలుగులోకి తీసుకురావాలని కోరారు. సమావేశంలో సదరు సంస్థ ప్రతినిధులు సువర్ణ, పద్మశ్రీ, నాగలక్ష్మి, రాజేశ్వరి, లీలావతి, సావిత్రి, సోమశేఖర్, పద్మ తదితరులు పాల్గొన్నారు.


