ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు మాటలకే పరిమితం పాలకుల తీరుపై మండిపాటు చిత్తూరులోని గాంధీ విగ్రహం వద్ద మామిడి రైతు సంఘం నిరసన
చిత్తూరు రూరల్ (కాణిపాకం): పాలకుల నిర్లక్ష్యం, గుజ్జు పరిశ్రమల దోపిడీ కారణంగా మామిడి పంట కుదేలవుతోందని, మామిడి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మామిడి రైతు సంఘం నేతలు మండిపడ్డారు. వారు బుధవారం చిత్తూరు నగరంలోని పీసీఆర్ సర్కిల్‌లో ఉన్న గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గాంధీ విగ్రహానికి అందజేశారు. మామిడి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సి.మునీశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ మామిడి రైతుల సమస్యలను పలుమార్లు అధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదని ధ్వజమెత్తారు. మాటలకే పరిమితమయ్యారని, క్షేత్రస్థాయిలో రైతుకు చేసిందేమీ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ప్రభుత్వం తోతాపురి కేజీకి రూ.12 మద్దతు ధర ప్రకటించిందని, అందులో ప్రభుత్వ వాటా రూ.4 రైతుల ఖాతాల్లో పడినా గుజ్జు పరిశ్రమలు, ర్యాంపులు రూ.8 ఇవ్వకుండా దగా చేశాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేయించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారని విమర్శించారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం రూ.4 మద్దతు ధర ప్రకటించిందని, కలెక్టర్ ఏకపక్షంగా తోతాపురి మామిడి కేజీ ధరను రూ.7.50లుగా ప్రకటించడాన్ని తప్పుబట్టారు. కనీసం ఆ ఏడున్నర రూపాయలైనా రైతులకు ఇప్పించడంలో ప్రభుత్వ యంత్రాంగం ఘోరంగా విఫలమైందన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.17.47 మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా రైతుల ఖాతాలకే జమ చేయాలని డిమాండ్ చేశారు.
మామిడి రక్తంతో వ్యాపారుల దోపిడీ
మామిడి రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బంగారు మురళి మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాలను ఒక్క ఫ్యాక్టరీ కూడా అమలు చేయలేదని విమర్శించారు. మామిడి రైతుల రక్తంతో జరుగుతున్న వ్యాపార దోపిడీకి అడ్డుకట్ట వేయలేకపోవడం బాధాకరమన్నారు. ఎన్ని బెదిరింపులు, నిర్బంధాలు ఎదురైనా రైతు సంఘం రైతు పక్షానే పోరాడుతుందని స్పష్టం చేశారు. కన్నబిడ్డల్లా పెంచుకున్న మామిడి చెట్లను నరకలేక, అప్పులు తీర్చలేక రైతులు ఆవేదన చెందుతున్నా పాలకులకు పట్టింపులేకపోవడం దుర్మార్గమన్నారు. మామిడి రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఉమాపతి నాయుడు మాట్లాడుతూ ‘మామిడి రైతుల సంక్షేమ సంఘం’ పేరుతో కొందరు వ్యాపారవేత్తలు రైతులను నట్టేట ముంచుతున్నారని ఆరోపించారు. అలాంటి వారితో రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఉపాధ్యక్షుడు మునిరత్నం నాయుడు మాట్లాడుతూ అధికారులు గుజ్జు పరిశ్రమల సంక్షేమం గురించే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు జనార్దన్, రామానాయుడు, వెంకట్‌రెడ్డి, కొట్రకోన సందీప్, రవిప్రసాద్, హేమలత, మోహన్‌రెడ్డి, ఉమాపతి రెడ్డి, త్యాగరాజులురెడ్డి, జయదేవయ్య, చంగల్‌రాయ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


