విజయపురం (నగరి): విజయపురం మండలం ఇల్లత్తూరు గ్రామంలో బుధవారం వివాహిత నిరోష (26) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల కథనం మేరకు.. ఇల్లత్తూరుకు చెందిన నిరోషకు తమిళనాడు, తిరువళ్లూరు జిల్లా మనువూరుకు చెందిన కార్తీక్‌తో 11 ఏళ్ల క్రితం వివాహమైంది. వారికి కుమారుడు రితీష్, కుమార్తె వేంబా ఉన్నారు. వారు ప్రస్తుతం 5, 1వ తరగతులు చదువుతున్నారు. కుటుంబ కలహాల కారణంగా నిరోష మూడేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. ఆమె కుమారుడు, కుమార్తెతో కలిసి ఇల్లత్తూరులో నివాసం ఉంటోంది. ఆమె తిరువళ్లూరు సమీపంలోని ఎల్‌ఎస్‌ఎస్ ఆటోమోటివ్ కంపెనీలో ఆరేళ్లుగా పనిచేస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి 11 గంటల వరకు నిరోష మేల్కొని ఉన్నట్లు తెలిసింది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది మిస్టరీగా మారింది. నిరోష మృతిపై ఆమె కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం, తిరుపతి నుంచి వచ్చిన ఆర్‌ఎఫ్‌ఎస్‌ఎల్ (రీజినల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ) నిపుణులు ఆధారాలు సేకరించారు. పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత మృతికి గల కారణాలపై స్పష్టత వస్తుందని పోలీసులు తెలిపారు.
పాత హత్య కేసు కోణంలోనూ విచారణ
ఈ కేసులో గత కుటుంబ పరిణామాలపై పోలీసులు దృష్టి సారించారు. నిరోషకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని అనుమానించిన భర్త కార్తీక్ 2022లో ఆమెతో ఘర్షణకు దిగాడు. దీనికి నిరోష తల్లి కారణమని భావించి ఆమెను కత్తితో పొడిచి చంపి తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన కార్తీక్ ప్రస్తుతం తమిళనాడులోని తిరువళాంగాడు సమీపంలోని మనువూరు గ్రామంలో ఉంటున్నట్టు సమాచారం. ఈ నెల 5వ తేదీన కాపురానికి రమ్మని నిరోషతో అతను మాట్లాడినట్లు స్థానికులు చెబుతున్నారు. నిరోష మెడపై గాయాలు ఉండడం, పక్కనే హీటర్ వైరు పడివుండడం ఆమెది హత్యే అనడానికి బలాన్ని చేకూరుస్తోంది. నిరోష మృతి సహజమా? లేక హత్యా? అనే కోణాలతో పాటు, గత ఘటనలతో ఏమైనా సంబంధం ఉందా, సన్నిహితులు ఎవరైనా ఈ అఘాయిత్యానికి పాల్పడారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. సీఐ ఎ.భాస్కర్ పర్యవేక్షణలో ఎస్‌ఐ వెంకటసుబ్బయ్య దర్యాప్తు చేపట్టారు. తండ్రి హత్య కేసులో జైలు, బెయిలు అంటూ కనుమరుగు కావడం, కన్నతల్లి కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో చిన్నారులు అనాథలుగా మారారు.


