ములకలపల్లిలో దోపిడీ | - | Sakshi
Sakshi News home page

ములకలపల్లిలో దోపిడీ

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

కుప్పం రూరల్‌ : కుప్పం మండలం ములకలపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి ముగ్గురు యువకులు ఒక ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి అపహరించారు. స్థానికుల కథనం మేరకు.. ములకలపల్లికి చెందిన రత్నమ్మ పక్కింటి చెల్లమ్మతో కలిసి ఇంట్లో టీవీ చూస్తోంది. ఉన్నట్టుండి ముగ్గురు యువకులు ఇంట్లోకి చొరబడ్డారు. రత్నమ్మ, చెల్లమ్మపై దాడి చేశారు. వారి వద్ద ఉన్న 60 గ్రాముల బంగారం, వెండి గజ్జెలు, చెల్లమ్మ వద్ద ఉన్న మరో 8 గ్రాముల బంగారు గొలుసు దోపిడీ చేసుకుని ఉడాయించారు. మహిళలు కేకలు వేయడంతో గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. అప్పటికే దుండగులు పరారయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

రైల్వే స్థలం స్వాధీనం

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు నగరంలో రైల్వేశాఖకు చెందిన స్థలాన్ని ఆశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రైల్వే స్టేషన్‌ను ఆనుకుని ఓ పెట్రోలు బంకు ఉంది. అక్కడికి బుధవారం రైల్వే పోలీసులు, అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. కట్టడాలను తొలగించారు. పలు వస్తువులను పెట్రోలు బంకు నిర్వాహకులు తీసుకెళ్లగా.. స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

జిల్లాలో పోలీసుల గస్తీ

చిత్తూరు అర్బన్‌: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ డూడీ ఆదేశాలతో బుధవారం జిల్లాలోని వాణిజ్య సముదాయాలు, రైల్వేస్టేషన్లు, విద్యాసంస్థలు, ఆలయాలు, బ్యాంకు పరిసరాల్లో కాలినడకన గస్తీ నిర్వహించారు. ఫుట్‌ పట్రోలింగ్‌ ద్వారా ప్రజలతో మమేకమై, వారి సమస్యలు తెలుసుకోవడమే ఈ కార్యక్రమం లక్ష్యమని పోలీసులు తెలిపారు.

పోలీసులతో సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ వాగ్వాదం

చిత్తూరు అర్బన్‌: విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌తో వాగ్వాదానికి దిగడంతోపాటు అతని కాళ్లపై వాహనాన్ని ఎక్కించడానికి ప్రయత్నించిన సీఆర్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. చిత్తూరు వన్‌టౌన్‌ సీఐ చినపెద్దయ్య కథనం మేరకు.. నగరంలోని సాంబయ్య కండ్రిగ వద్ద మంగళవారం పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. చిత్తూరు మండలం ఎన్‌ఆర్‌.పేటకు చెందిన ప్రకాష్‌ సీఆర్‌పీఎఫ్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తూ సెలవుపై వచ్చాడు. ఈ నేపథ్యంలో పోలీసులు వాహనం తనిఖీ చేసి రికార్డులు–హెల్మెట్‌ లేనందుకు రూ.2 వేలు జరిమానా వేశారు. ఈ క్రమంలో ప్రకాష్‌ అక్కడు భద్రతా సిబ్బందితో వాదనకు దిగాడు. పోలీసుల వాహనాలకు రికార్డులు ఉన్నాయా? మీరు అన్నీ సక్రమంగా ఉంచుకున్నారా? అంటూ ప్రశ్నించాడు. అంతటితో ఆగక తన ద్విచక్ర వాహనానంతో అక్కడ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ పురుషోత్తంపై కాళ్లపై ఎక్కించాడు. దీనిపై కానిస్టేబుల్‌ పురుషోత్తం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రకాష్‌పై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement