‘చచ్చే వరకు కొడతాం’ | - | Sakshi
Sakshi News home page

‘చచ్చే వరకు కొడతాం’

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

● మాధిరెడ్డిపల్లిలో టీడీపీ యువకుడి బ్యానర్‌ కలకలం ● చంద్రబాబు క్రమశిక్షణ మాటలు ఒట్టివేనా?

యాదమరి: మండలంలోని మాధిరెడ్డిపల్లిలో టీడీపీకి చెందిన ఒక యువకుడు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ, బ్యానర్లు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా బ్యానర్లపై రాసిన వ్యాఖ్యలు సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. గ్రామంలో ఏర్పాటు చేసిన ఒక బ్యానర్‌పై ‘మాట్న మరణ అడి’ అని రాసి ఉంది. స్థానిక భాషలో దీని అర్థం ‘దొరికితే చచ్చే వరకు కొడతాం’ అని హెచ్చరించడం. అలాగే మరొక బ్యానర్‌లో ‘మనల్ని ఎవడురా ఆపేది’ అంటూ రాసి ఉంది. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇలాంటి బెదిరింపు ధోరణి పోస్టర్లు పెట్టడంపై స్థానికులు అసహనం వ్యక్తంచేస్తున్నారు.

క్రమశిక్షణ మాటలు ఒట్టివేనా?

టీడీపీ క్రమశిక్షణకు మారు పేరని, పార్టీలో ఎవరూ హద్దులు దాటకూడదని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంతరం చెబుతుంటారు. క్షేత్ర స్థాయిలో కొంతమంది నాయకులు, కార్యకర్తల ప్రవర్తన చూస్తుంటే చంద్రబాబు మాటలకు విలువ లేకుండా పోతోందని, అవి ఉత్తిత్తి మాటలేనని తెలుస్తోందని స్థానికులు విమర్శిస్తున్నారు. సమాజంలో రెచ్చగొట్టేలా బ్యానర్లు ఏర్పాటు చేసినా, సోషల్‌ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించిన మరుసటి రోజే ఇలా బ్యానర్లు ఏర్పాటుచేయడం గమనార్హం. ఇంత జరుగుతున్నా స్థానిక పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ వివాదాస్పద బ్యానర్లపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement