గుండె తరిగేలా..! | - | Sakshi
Sakshi News home page

గుండె తరిగేలా..!

Jul 9 2026 6:41 AM | Updated on Jul 9 2026 6:41 AM

● రోగిపై సెక్యూరిటీ గార్డు ప్రతాపం ● చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఘటన

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): చిత్తూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో మానవత్వాన్ని మంటగలిపే దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన ఓ క్షతగాత్రుడిపై సెక్యూరిటీ గార్డు పాశవికంగా దాడి చేసిన ఉదంతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. జనవరిలో ఆస్పత్రిలోని ఎంఎస్‌ వార్డులో చికిత్స పొందుతున్న ఒక రోగిని సెక్యూరిటీ గార్డు దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా చేతులు మడిచి మరీ వికృతంగా ప్రవర్తించాడు. తీవ్ర అస్వస్థతతో ఉన్న ఆ రోగి, తనపై జరుగుతున్న దాడిని తట్టుకోలేక అతికష్టం మీద సెక్యూరిటీ గార్డుపై తిరగబడిన దృశ్యాలు చూసే వారిని కలచివేస్తున్నాయి. బుధవారం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయింది. అసలు ఈ ఘోరం బయటపడడానికి సోమవారం రాత్రి జరిగిన మరో ఘటనే కారణం. పెద్ద పంజాణి మండలం చిన్నంపల్లికి చెందిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చేరాడు. సోమవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో రౌండ్స్‌ పేరుతో వార్డులోకి వచ్చిన అదే సెక్యూరిటీ గార్డు, రోగి సహాయకులను బూటు కాళ్లతో తన్నినట్టు ఆరోపణలు వచ్చాయి. పక్కనే బెడ్‌పై ఉన్న తమిళనాడుకు చెందిన మరో రోగి ఈ అమానుషాన్ని గమనించి సెక్యూరిటీ గార్డును నిలదీశాడు. రోగులపై బూటు కాళ్లతో దాడి చేస్తారా? అంటూ గొడవకు దిగాడు. ఈ వివాదం కాస్తా ముదరడంతో కొందరు వ్యక్తులు సదరు గార్డు గతంలో చేసిన దాడి తాలూకు వీడియోను బుధవారం బయటపెట్టారు.

విధుల నుంచి తొలగింపు..

ఈ ఘటనపై ఆస్పత్రి యాజమాన్యం తీవ్రంగా స్పందించింది. వివాదం ముదరడంతో మంగళవారం ఉదయం సదరు సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించింది. ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి అటెండర్లతో సిబ్బంది ఎలా వ్యవహరించాలనే దానిపై కఠినంగా కౌన్సెలింగ్‌ ఇస్తామని, ఆస్పత్రి ప్రతిష్టకు భంగం కలిగించేలా ప్రవర్తించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని యాజమాన్యం స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement