ట్రాక్టర్లలోనే కుళ్లిపోతున్న కాయలు కన్నీరుమున్నీరవుతున్న అన్నదాతలు
కాణిపాకం: జిల్లాలో మామిడి సాగు తీవ్ర నష్టాలను మిగుల్చుతోంది. ఈ ఏడాది సుమారు 59 వేల హెక్టార్లలో మామిడి సాగు చేయగా, అందులో సింహభాగం అంటే 41 వేల హెక్టార్లలో తోతాపురి రకమే సాగైంది. అధికారులు ఈ ఏడాది జిల్లాలో 4.84 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కానీ పల్ప్ ఫ్యాక్టరీల మాయాజాలం, అధికారుల ఉదాసీనత వల్ల సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు ఫ్యాక్టరీల గేట్ల ముందు, తోటల్లో కుళ్లిపోయినట్టు రైతు సంఘాలు మండిపడుతున్నాయి.
టోకెన్ల మాయాజాలం
మామిడి కాయలు కోసి ఫ్యాక్టరీకి తీసుకొస్తే.. లోపలికి పోనివ్వకుండా వారం రోజుల పాటు టోకెన్ల పేరుతో, రంగుల పేరుతో రైతును నడిరోడ్డుపై పడిగాపులు కాయించారు. పగలు ఎండకు ఎండి, రాత్రిళ్లలో దోమ బాధకు గురవుతూ రోడ్డు పక్కనే పడుకుని రైతులు పడరానిపాట్లు పడ్డారు. వారం రోజుల పాటు లారీలు, ట్రాక్టర్ల బేసిన్లలోనే మామిడికాయలు మగ్గిపోయాయి. చివరకు గేట్ల వద్దకు రాగానే నాణ్యత లేదు.. కుళ్లిపోయాయని ఫ్యాక్టరీల యాజమాన్యాలు తిరస్కరించాయి.
రూ.295 కోట్లు బూడిదలో పోసిన పన్నీరేనా?
రైతు సంఘాల నాయకులు క్షేత్ర స్థాయి పరిశీలన తర్వాత చెప్తున్న లెక్కలు వింటే గుండె తరుక్కుపోతోంది. ఫ్యాక్టరీల నిర్వాహకులు, దళారులు ఆడిన నాటకం వల్లే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల కాయలు వృథా అయ్యాయి. రైతులకు జరిగిన నికర పెట్టుబడి నష్టం అక్షరాలా రూ.295 కోట్లు.
మామిడి రైతులపై కక్ష?
జిల్లాలోని 35 ఫ్యాక్టరీలు, 52 ర్యాంపుల ద్వారా 2,72,769 మెట్రిక్ టన్నులు కొనుగోలు చేసినట్లు అధికారులు చెపుతున్నారు. ఈ కొనుగోళ్ల వెనుక పెద్ద స్కామే నడిచింది. ఇందులో మన జిల్లా రైతుల పంట కంటే పక్క రాష్ట్రమైన తమిళనాడు నుంచి వచ్చిన కాయలే ఎక్కువగా ఉన్నాయి!. సుమారు 70 వేల నుంచి 80 వేల మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకున్నారు. స్థానిక రైతుల కాయలను వారం రోజుల పాటు రోడ్లపై కుళ్లబెట్టిన అధికారులు.. తమిళనాడు నుంచి వచ్చిన లారీలను క్యూలైన్లు లేకుండా ఫ్యాక్టరీల లోపలికి ఎలా పోనిచ్చారని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. అధికారుల, ఫ్యాక్టరీల ముందస్తు ‘సిండికేట్’ దందా ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం ప్రకటించాలని, రైతులను వంచించిన ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది.
ఐరాల మండలంలో మేకలకు మేతగా మారిన మామిడి కాయలు (ఫైల్)
నష్టపరిహారం ఇవ్వాల్సిందే
ఫ్యాక్టరీలకు జిల్లా కాయలతో పాటు తమిళనాడు కాయలు లారీల్లో వచ్చాయి. వీటిని ఎందుకు అధికారులు అడ్డుకోలేకపోయారు. ఈ సారి జిల్లాలో పండిన పంటను కుళ్లబెట్టింది కాకుండా..ఫ్యాక్టరీ లోపలికి తీసుకెళితే అక్కడ సగానికి సగం కాయలు తిరస్కరించారు. ఈ రకంగా చేస్తే రైతులు ఎలా బాగుపడుతారు. మా అంచనా ప్రకారం సుమారు 2లక్షల మెట్రిక్ టన్నుల కాయలు రోడ్డు పాలైంది. వీటన్నింటికీ ఫ్యాక్టరీల సిండికేట్ ప్రధాన కారణం. ఇందుకు ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి.
–మునీశ్వర్‌రెడ్డి, మామిడి రైతుల సంఘ జిల్లా అధ్యక్షుడు, చిత్తూరు
పల్ప్ ఫ్యాక్టరీల వద్ద మామిడి రైతుల పడిగాపులు
రైతు సంఘాల లెక్కల ప్రకారం నష్టాల వివరాలు


