పశువైద్యం.. బహుదూరం! | - | Sakshi
Sakshi News home page

పశువైద్యం.. బహుదూరం!

Jul 7 2026 11:51 PM | Updated on Jul 7 2026 11:51 PM

జిల్లాలో పాడి పరిశ్రమకు అందని వైద్యం

సచివాలయాలకే పరిమితమవుతున్న

సహాయకులు

మధ్యాహ్నానికే పశు ఆస్పత్రులకు తాళాలు

డుమ్మా కొడుతున్న వైద్యులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): పల్లెల్లో పశువైద్యం పడకేసింది. మూగజీవాల ప్రాణాలు గాల్లో దీపాలుగా మారాయి. అధికార యంత్రాంగం కాగితాలపై చెప్తున్న మాటలకు.. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న దారుణాలకు ఎక్కడా పొంతన లేకుండా పోతోంది. నమ్ముకున్న జీవాలు కళ్ల ముందే కానరాని లోకాలకు పోతుంటే.. పాడిరైతులు కన్నీరుమున్నీరవుతున్నారు.

గాడి తప్పిన పశువైద్యం

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాడి పరిశ్రమకు ప్రాణం పోసింది. రైతు భరోసా కేంద్రాలను తీసుకొచ్చి పాడికి అండగా నిలించింది. గ్రామాల్లో పశువులకు తక్షణ వైద్య సేవలకుగాను పశువైద్య సహాయకులను నియమించింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పశువైద్యం పూర్తిగా గాడితప్పింది. పలు చోట్ల సహాయకులు వారి విధులను గాలికొదిలేస్తున్నారు. పశుగ్రాస క్షేత్రాలు, పాడి రైతుల ఇళ్ల వద్ద ఉండాల్సిన వీరు.. కేవలం కేంద్రాలకే పరిమితమవుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో రైతులు ఫోన్‌ చేసినా స్పందించే నాథుడే కరువయ్యాడు. ఇక మండల కేంద్రాల్లోని పశు వైద్యశాలల పరిస్థితి మరీ ఘోరం. ఉదయం కాసేపు తెరుచుకునే ఈ ఆస్పత్రులు.. మధ్యాహ్నానికల్లా మూతపడుతున్నాయి. ఆ తర్వాత వైద్యులు, సిబ్బంది డుమ్మా కొడుతున్నారు.

ప్రయివేటుగా కొనాల్సిందే

మండల పశువైద్యశాలలకు, రైతు భరోసా కేంద్రాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న విలువైన మందులు, మాత్రలు అర్హులైన రైతులకు చేరడం లేదు. కొందరు మండల వైద్యులు, తమ కింద పనిచేసే సహాయకులతో చేతులు కలిపి ఆ మందులను ప్రైవేటుపరం చేస్తున్నారు. జిల్లా పశు ఆస్పత్రికి వస్తే.. మందులు లేవు.. బయట కొనుక్కోండి అంటూ ప్రిస్క్రిప్షన్లు చేతిలో పెడుతున్నారు. యాంటీబయాటిక్స్‌, పెయిన్‌ కిల్లర్స్‌, విటమిన్‌ ఇంజెక్షన్లు, చివరకు ప్రసవానంతరం ఆవులు పడిపోకుండా ఇచ్చే కాల్షియం, ఐవీ ఫ్లూయిడ్స్‌ కూడా ప్రభుత్వ కేంద్రాల్లో దొరకడం లేదు. అంతా ప్రైవేటుగా కొనాల్సి రావడంతో పాడి రైతుల జేబులకు చిల్లులు పడుతోంది.

గాల్లో ప్రాణాలు

జిల్లాలో ప్రభుత్వ పశు వైద్యం అపహాస్యం అవుతోంది. ఇదే అదునుగా అక్రమార్కులు రాజ్యమేలుతున్నారు. కనీస అర్హత లేని నకిలీ వైద్యులు పల్లెల్లో ఇష్టారాజ్యంగా ఇంజెక్షన్లు ఇస్తూ రైతులను దోచుకుంటున్నారు. తప్పుడు వైద్యం వల్ల తీవ్రమైన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, గాలికుంటు వ్యాధి, గొంతువాపు వంటి వ్యాధులు ముదిరి.. లక్షల రూపాయల విలువైన పాడి ఆవులు మృత్యువాత పడుతున్నాయి. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు మేల్కొని, క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేపట్టి, మందుల కొరత తీర్చాలని పాడి రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

జిల్లా సమాచారం

జిల్లా పశువుల ఆస్పత్రి 01

ఏరియా పశు వైద్యశాలలు 14

వెటర్నరీ డిస్పెన్సరీలు 68

రూరల్‌ లైఫ్‌ స్టాక్‌ యూనిట్లు 75

రైతు భరోసా కేంద్రాలు 297

పాడి ఆవులు 4,67,507

గేదెలు 1,036

కుక్కలు, కోళ్లు 5,08,808

మేకలు 13,80,063

గొర్రెలు 4,38,362

మూడు రోజులకు రూ.5వేల వరకు ఖర్చు

గతనెల ఒక పాడి ఆవు చనిపోయింది. ఆ ఆవు విలువ రూ.85 వేలు. ఇంకో ఆవు మేత తినడం లేదు. ప్రైవేటు వ్యక్తుల వద్ద చూపిస్తే.. వాళ్లు చేసే వైద్యం వల్ల ఆవులు చనిపోతున్నాయి. ఇష్టానుసారంగా మందులు ఇచ్చేస్తున్నారు. అందుకని చిత్తూరు నగరంలోని జిల్లా పశువైద్య ఆస్పత్రికి వచ్చాను. ఇక్కడ చూస్తే మందులు లేవు. మూడు రోజుల పాటు రెండు బాటిళ్ల గ్లూకోజ్‌ రాసిచ్చారు. ఒక్కొ బాటిల్‌ ధర రూ.480. ఇలా మూడు రోజుల పాటు ఆరు బాటిళ్లు రాసిచ్చారు. దీనికి తోడు ఇతరాత్ర మందులు, మాత్రలు కలిపి రూ.5వేల వరకు ఖర్చు అయింది.

– మురళి, యాదమరి మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement