మామిడి ర్యాంపులు మూసివేయండి! | - | Sakshi
Sakshi News home page

మామిడి ర్యాంపులు మూసివేయండి!

Jul 7 2026 11:51 PM | Updated on Jul 7 2026 11:51 PM

● దీన్నే కుంకీగా మార్చేందుకు ఫారెస్ట్‌ అధికారుల ప్రయత్నం ● హైవేను వదలని ఒంటరి ఏనుగు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో మామిడి ర్యాంపుల మూసివేతకు కలెక్టర్‌ ఉత్తర్వులు జారీచేసినట్లు మార్కెటింగ్‌శాఖ ఏడీ పరమేశ్వరన్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన జిల్లాలోని పలు ర్యాంపులను పరిశీలించి సూచనలు చేశారు. పులిచెర్ల, రొంపిచర్ల, గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, పెనుమూ రు, యాదమరి, గుడిపాల, చిత్తూరు మండలాల్లోని అన్ని ర్యాంపులను బుధవారం సాయంత్రానికి పూర్తిగా మూసివేయాలని ఆదేశించారు. ఆయా ర్యాంపుల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు రేపు సాయంత్రంలోగా కొనుగోళ్లకు సంబంధించిన పూర్తి డేటాను సేకరించి, మార్కెట్‌ కమిటీ కార్యదర్శులకు సమర్పించాలని స్పష్టం చేశారు. రేపు సాయంత్రం తర్వాత ర్యాంపులకు మామిడి కాయలు తీసుకొస్తే ఎలాంటి సబ్సిడీ వర్తించదని, రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. అలాగే బంగారుపాళెం, తవణంపల్లి మండలాల్లోని ర్యాంపులను ఈ నెల 10న మూసివేయనున్నట్లు ఏడీ వెల్లడించారు.

నేడు మామిడి రైతుల

శాంతియుత నిరసన

గంగాధరనెల్లూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతు సంఘం నేతల ఆధ్వర్యంలో మామిడి రైతుల ఆవేదనను జిల్లా కేంద్రం చిత్తూరులో బుధవారం శాంతియుత నిరసన ద్వారా తెలియజేయనున్నట్టు చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘ నేత కె ఆర్‌ వెంకటరెడ్డి తెలిపారు. జీడీ నెల్లూరు మండల కేంద్రంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. 2025, 2026 సంవత్సరాలలో మామిడి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. ప్రభుత్వం కనీస మద్దతు ధర కల్పించాలని, మామిడి రైతులను ఆదుకోవాలని కోరారు. జిల్లా నడిబొడ్డున గాంధీ సర్కిల్‌ వద్ద బుధవారం ఉదయం 10 గంటలకు మామిడి రైతులందరూ శాంతియుత నిరసనకు విచ్చేయా లని ఆయన పిలుపునిచ్చారు. ఆయన వెంట గుణశేఖర్‌రెడ్డి, లక్ష్మీ కరారెడ్డి, రూపకుమార్‌రెడ్డి, అశోక్‌ ఉన్నారు.

మొగిలిఘాట్‌లో

మదపుటేనుగు హల్‌చల్‌

పలమనేరు: పట్టణ సమీపంలోని మొగిలి ఘాట్‌లో ఒంటరి మదపుటేనుగు మంగళవారం రెండు గంటలపాటు బెంగళూరు– చైన్నై హైవేపై హల్‌చల్‌ చేసింది. ఈ ఏననుగు ఒంటరిగా గత కొన్ని నెలలుగా మొగిలి ఘాట్‌లోనే సంచరిస్తోంది. మొగిలి ఘాట్‌లో రోడ్డు దాటుతూ ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికుల స్మార్ట్‌ పోన్లకు చిక్కింది. ఇప్పటికే ముసలిమొడుగు వద్ద అటవీశాఖ ఏర్పాటు చేసిన కుంకీ క్యాంపు ప్రయోజనం లేకుండా పోయింది. ఇక్కడున్న ఆరు ఏనుగుల్లో రెండింటిని రామకుప్పం సమీపంలోని ననియాలకు వెనక్కిపంపారు. క్యాంపులో ఉన్న నాలుగు ఏనుగుల ద్వారా మదపుటేనుగులను పట్టుకోలేక పోతున్నారు. ఇక్కడున్న మదపుటేనుగులను మచ్చికచేసి పట్దుకుంటే దానిని కుంకీగా మార్చవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీన్ని ఫారెస్ట్‌ అధికారులు పట్టుకొనేదెప్పుడు, కుంకీగా మార్చేదెప్పుడో అర్థం కావడం లేదు. దీనిపై పలమనేరు ఎఫ్‌ఆర్వో చాంప్లానాయక్‌ను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన స్పందించ లేదు, వారి సిబ్బంది సైతం ఫోన్లు పిక్‌ చేయడం లేదు.

దరఖాస్తులకు

నేడే ఆఖరు

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లాలో స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఇన్‌చార్జ్‌ డీఈవో వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీల నియామకానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నియామకాలు ప్రతిభ ఆధారంగానే నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, మున్సిపల్‌ పాఠశాలల్లో స్కూల్‌ అసిస్టెంట్‌ – ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్లుగా పనిచేస్తున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అండర్‌–19 విభాగానికి సంబంధించి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, అలాగే ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, ఏపీఆర్‌ఈఐఎస్‌ జూనియర్‌ కళాశాలల్లో పనిచేస్తున్న జూనియర్‌ లెక్చరర్లకు (ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌) ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. అభ్యర్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానం ఉండటం తప్పనిసరన్నారు. అమరావతిలోని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయంలో నిర్వహించే ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుందన్నారు. ఎంపికయ్యే జిల్లా స్కూల్‌ గేమ్స్‌ సెక్రటరీ పదవీకాలం ఒక సంవత్సరం (2026–27 విద్యా సంవత్సరం) మాత్రమే ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement