నేత్తురోడుతున్న జాతీయ రహదారి | - | Sakshi
Sakshi News home page

నేత్తురోడుతున్న జాతీయ రహదారి

Jul 7 2026 1:37 AM | Updated on Jul 7 2026 1:37 AM

● రోజురోజుకూ పెరుగుతున్న ప్రమాదాలు ● వందలాది మంది మృత్యువాత ● భద్రతా చర్యలు తీసుకోని అధికారులు ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న స్థానికులు

ప్రమాదాలకు ప్రధాన కారణాలు ఇవే..

నేషనల్‌ హైవే రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారింది. ఒక పక్క వాహనదారుల అతి వేగానికి తమకు తామే బలవుతుంటే అడ్డొచ్చిన వేరొకరి ప్రాణాలు సైతం గాలిలో కలిసిపోతున్నాయి. ఇప్పటికే వేలాదిగా జరిగిన రోడ్డు ప్రమాదాల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. శరీర అవయవాలు దెబ్బతిని వికలాంగులుగా మారిన వారు వేల సంఖ్యలో ఉన్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్టు ఉండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తగిన చర్యలు తీసుకుని రోడ్డు ప్రమాదాలను నివారించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

వైఎస్సార్‌ జంక్షన్‌ సమీపంలో

లారీ కిందికి దూసుకెళ్లిన కారు(ఫైల్‌)

గంగవరం: మండలంలోని జాతీయ రహదారి(ఎన్‌హెచ్‌ 75) ప్రమాదాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ముఖ్యంగా వైఎస్సార్‌ జంక్షన్‌ నుంచి జీఎల్‌ఎస్‌ ఫారం, మామడుగు, పత్తికొండ, నాలుగు రోడ్లు, గండ్రాజుపల్లి, పెద్దఉగిణి ప్రాంతాలు రోడ్డు ప్రమాదాలకు నిలయాలుగా మారాయి. లోప భూయిష్టమైన రోడ్డు ఇంజినీరింగ్‌ పనులు, బ్లాక్‌ స్పాట్‌ లైటింగ్స్‌, అతివేగం, అజాగ్రత్త, నిబంధనల ఉల్లంఘన వంటి కారణాలతో నిత్యం ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇంటి నుంచి రోడ్డుపైకి వెళ్లిన వారు సురక్షితంగా ఇంటికి వస్తారో లేదోనన్న భయం కలుగుతోందని స్థానికులు వాపోతున్నారు. ఇటీవల జరిగిన ప్రమాదాల్లో వైఎస్సార్‌ జంక్షన్‌ వద్ద ఒక వ్యక్తి మృతిచెందాడు. అంతకు ముందు ఇదే జంక్షన్‌కు కొంత దూరంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృత్యువాత పడ్డారు. పెద్దఉగిణి వద్ద బాలుడు ద్విచక్ర వాహనానికి బలవడం ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రమాదాల్లో వందలాది మంది మృతిచెందారు.

భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నా..

రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో రవాణా, పోలీసు అధికారులు హడావుడి చేసి వదిలేస్తున్నారని, పూర్తి స్తాయిలో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఏటా రోడ్డు భద్రతా వారోత్సవాలు, మాసోత్సవాలను నిర్వహిస్తున్నా ప్రమాదాలు తగ్గడం లేదని చెబుతున్నారు. దీనికి తోడు హైవే అధికారులు ప్రమాదాలపై ఏమాత్రం శ్రద్ధ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో బ్లాక్‌ స్పాట్‌గా గుర్తించి అక్కడ లైటింగ్స్‌, రేడియం స్టిక్కర్స్‌, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రహదారులపై భద్రతను మెరుగు పరచడానికి అవసరమైన వేగ నియంత్రణ, రోడ్డు సంకేతాలు, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి చట్టాలను కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

హై స్పీడ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, డ్రైవింగ్‌ సమయంలో ఫోన్‌ మాట్లాడడం, హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరింకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రమాదాలు హైవే అధికారుల నిర్లక్ష్యం వల్లే జరుగుతున్నాయి. హైవేలో రాత్రిపూట లైట్లు వెలగకపోయినా పట్టించుకోకపోవడం లేదు. కొన్ని ప్రాంతాల్లో హైవేపై రోడ్డు పగుళ్లకు గురైనా మరమ్మతులు చేయడంలేదు. సూచిక బోర్డులు ఏర్పాటుచేయలేదు. అదే విధంగా వాహనాల పరిమితికి మించి వేగంతో ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. మితిమీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌, ట్రాఫిక్‌ రూల్స్‌ అతిక్రమించడం వంటివి ప్రమాదాలకు ప్రధాన కారణాలని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement