ప్రోత్సాహక నిధిపై కూటమి నేతల కన్ను కాగితాల్లో వేల టన్నుల మాయాజాలం ర్యాంపుల పేరుతో దోపిడీకి స్కెచ్ జూన్ 20 నిబంధనతో మామిడి రైతు గుండెల్లో రైళ్లు
కాణిపాకం: చిత్తూరు జిల్లాలో 2025 వరకు అనుమతి పొందిన మామిడి ర్యాంపులు 25. గత సీజన్‌లో రూ.కోట్లను స్వాహా చేసిన అక్రమార్కులు ఈ ఏడాది ఆ సంఖ్యను ఏకంగా 52కు (రిజిస్టర్డ్) పెంచేశారు. ఇవి కాకుండా అనుమతులు లేని మరో 20కి పైగా అక్రమ ర్యాంపులు నడుస్తున్నాయి. ఈ పెరుగుదల వెనుక ఉన్న మతలబు ఏమిటనేది బహిరంగ రహస్యం. ఈ ర్యాంపుల్లో అత్యధికంగా అధికార కూటమికి చెందిన ద్వితీయ శ్రేణి నేతలవి కావడంతో క్షేత్రస్థాయి అధికారులు సైతం చూసీచూడనట్లు ఉన్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత సీజన్‌లో బంగారుపాళ్యం, పలమనేరు, చిత్తూరు పరిసర ప్రాంతాల్లో పలు ర్యాంపుల నిర్వాహకులు రైతులకు అందాల్సిన రూ.4లను స్వాహా చేశారు. తక్కువ రకానికి చెందిన నీలం కాయలను కాగితాల్లో తోతాపురిగా మార్చేసి సబ్సిడీని నొక్కేశారు. ఈసారి ఆ దొంగ లెక్కలు చూసి ఉద్యాన శాఖ అధికారులకే మైండ్ బ్లాక్ అవుతోంది. ఏకంగా 10 వేల నుంచి 20 వేల మెట్రిక్ టన్నుల కాయలను ఫ్యాక్టరీలకు తరలించామంటూ కొందరు పెద్దమనుషులు దొంగ బిల్లులను ఆఫీసుల ముందు పడేశారు. వీళ్లు చూపిస్తున్న లెక్కలకు, క్షేత్రస్థాయి దిగుబడికి పొంతన కుదరకపోవడంతో అధికారులు అసలు గుట్టును ఛేదించే పనిలో పడ్డారు. జిల్లాలోని ర్యాంపుల ద్వారా సేకరించిన కాయలు నిజంగానే చిత్తూరులోని ఫ్యాక్టరీలకు వెళ్లాయా? లేక దొంగచాటుగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల ఫ్యాక్టరీలకు తరలించి.. ఇక్కడ నిధి కోసం నకిలీ క్లెయిమ్‌లు సృష్టిస్తున్నారా? అని విచారిస్తున్నారు. లేకుంటే పక్కనే ఉన్న తమిళనాడు నుంచి తక్కువ ధరకు కాయలు తెచ్చి ఇక్కడి లెక్కల్లో తోసేసి సబ్సిడీ నొక్కుతున్నారా? అనే కోణంలో పరిశీలన చేస్తున్నట్టు సమాచారం.
మామిడికి ప్రభుత్వం ప్రకటించిన
రూ.4 ప్రోత్సాహక నిధి కూటమి నేతలకు
అక్షయపాత్రగా మారింది. గతేడాది ప్రభుత్వ ఖజానాను నిలువునా ముంచేసిన మామిడి మాఫియా ఈ ఏడాది కూడా కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. ఈ సారి ఉద్యానవన శాఖ
అధికారులు అప్రమత్తమయ్యారు.
పచ్చముఠా మాయాజాలానికి చెక్ పెట్టాలని, నకిలీ బిల్లుల దందాకు అడ్డుకట్టవేయాలని చూస్తున్నారు. అనుమతి లేని అనధికారిక ర్యాంపులు, ట్రేడర్ల ద్వారా కాయలు
తోలి ఉంటే ఈ సారి ప్రోత్సాహక నిధి
వర్తించదని తేల్చి చెబుతున్నారు.


