చిత్తూరు కలెక్టరేట్ : గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పౌష్టికాహార పర్యవేక్షణ చేయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు యాప్‌ల నిర్వహణ నిలయాలుగా మారాయని అంగన్‌వాడీ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు సంయుక్తం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అంగన్‌వాడీలు చేవిలో పూలు పెట్టుకుని కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంగన్‌వాడీ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రేమ, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య మాట్లాడుతూ 2011 నుంచి అంగన్‌వాడీ ఉద్యోగుల వేతనాలు పెరగలేదన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో కుటుంబాల పోషణ కష్టంగా మారిందన్నారు.
నవచేతన యాప్ భారం
ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖ పనులను కూడా అంగన్‌వాడీల నెత్తిన రుద్దారని మండిపడ్డారు. నవచేతన యాప్‌లో ఒక బిడ్డ వివరాల నమోదుకు 20 నిమిషాలు పడుతోందని, పోషణ్ ట్రాకర్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్ వేయాలని, బాల సంజీవిని యాప్‌లో 25 రోజుల టేక్ హోమ్ రేషన్ వివరాలు పొందుపరచాల్సి వస్తోందని తెలిపారు. వీటికితోడు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు చిన్నారులకు ప్రీ–స్కూల్ నిర్వహించడం అసాధ్యంగా మారిందన్నారు. ప్రగతిశీల అంగన్‌వాడీ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి జ్యోతి మాట్లాడుతూ పీపీపీ సర్వేల పేరుతో అధికారులు ఒత్తిడికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన మొబైల్ ఫోన్లు సహకరించడం లేదన్నారు. ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పని ఒత్తిడి, అధికారుల వేధింపులతో అంగన్‌వాడీలు, హెల్పర్లు రోగాల బారిన పడుతున్నారని ఆరోపించారు. 50 ఏళ్లుగా ఐసీడీఎస్‌లో పనిచేస్తున్నా ఈఎస్‌ఐ, పీఎఫ్, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఈ ధర్నాలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోపీనాథ్, దాసరి చంద్ర, రఘు, గోవింద్, స్వామి, మోహన్ పాల్గొన్నారు. అంగన్‌వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరపున ప్రభావతి, అరుణ, సరస్వతి, శాంతి, జ్యోతి, సుజాత, రాధ, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


