చిత్తూరు కలెక్టరేట్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త పింఛన్ల జాడ కనిపించని పరిస్థితి. అర్హత ఉండి పింఛన్లు అందక వేలాది మంది బాధితులు జిల్లాలో అవస్థలు పడుతున్నారు. నిత్యం అధికారులు, సచివాలయాల చుట్టూ తిరుగుతూ అర్జీలు అందజేస్తున్నారు. కొత్త పింఛన్లు ఎప్పుడిస్తారు మహా ప్రభు అంటూ మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వానికి జాలి కలగడం లేదు. కొత్త పింఛన్ల మంజూరుపై స్పష్టత ఇవ్వకపోవడంతో అర్హులు తీవ్రంగా నష్టపోతున్నా రు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే పీజీఆర్‌ఎస్‌లోనూ పింఛన్లు ఇవ్వాలన్న అర్జీలు అధికమవుతూనే ఉన్నాయి. అంతేకాకుండా కొత్త పింఛన్లకు ఎమ్మెల్యేల సిఫార్సులతో ఇప్ప టి వరకు దాదాపు 1,879 వరకు అర్జీలు పీజీఆర్‌ఎస్‌లో నమోదైనట్లు సమాచారం. సచివాలయాల్లో 25,487 వరకు అర్జీలు నమోదయ్యా యి. జిల్లాలో వేల సంఖ్యలో కొత్త పింఛన్ల మంజూరుకు అర్హులు ఎదురుచూస్తూనే ఉన్నారు.
25 చోట్ల కార్డెన్ సెర్చ్
చిత్తూరు అర్బన్ : ‘ధైర్య స్పర్శ – ఆపరేషన్ ప్లష్ అవుట్’ కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీసుశాఖ ఆదివారం 25 ప్రాంతాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టింది. ఈ క్రమంలో పోలీసులు ఐరాల మండలం గుండ్లపల్లెలో గన్‌పౌడర్, పేలుడు పదార్థాలకు ఉపయోగించే ముడి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మాదకద్రవ్యాల వాడకాన్ని అరికట్టడానికి జిల్లా వ్యాప్తంగా డ్రగ్ డిటెక్షన్ కిట్స్ ద్వారా 110 మందికి పరీక్షలు చేశారు. పూతలపట్టు, గంగవరం, విజయపురం, పాలసముద్రం ప్రాంతాల్లోని నలుగురు వ్యక్తులకు పాజిటివ్ వచ్చింది. వారిపై మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద చర్యలు చేపట్టనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ తెలిపారు. ప్రజలు మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని కోరారు.
లింగ నిర్ధారణ కేసులో నలుగురి అరెస్టు
బంగారుపాళెం : మండలంలోని చంద్రశేఖరపురం గ్రామంలో అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్న కేసులో నలుగురు ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. ఆయన ఆదివారం సాయంత్రం స్థానిక పోలీస్ స్టేషన్‌లో విలేకరులతో మాట్లాడారు. చంద్రశేఖరపురం సమీపంలో రోమన్‌కుమార్ మామిడితోటలో నిర్మాణంలో ఉన్న భవనంలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు తుంబకుప్పం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ లోహిత్‌చెంగల్‌రాయన్‌కు సమాచారం అందిందన్నారు. ఆయన ఫిర్యాదు మేరకు వైద్యశాఖ అధికారులతో కలిసి దాడి చేశామన్నారు. పోలీసులను చూసి కొందరు వ్యక్తులు పారిపోగా, మరి కొందరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. విచారణలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర నుంచి గర్భిణులను పోన్ ద్వారా సంప్రదించి లింగ నిర్ధారణ పరీక్ష కేంద్రానికి తీసుకువచ్చి స్కానింగ్ చేసి పుట్టబోయే బిడ్డ ఆడా, మగా అని చెబుతున్నట్టు తేలిందన్నారు. ఒక్కొక్క గర్భిణి నుంచి రూ.10 వేలు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో చిత్తూరు పట్టణం మిట్టూరుకు చెందిన పద్మ, పోలీస్ కాలనీకి చెందిన జ్యోతి, బంగారుపాళెం మండలం చీకూరుపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ జ్యోతీష్, చంద్రశేఖరపురానికి చెందిన రోమన్‌కుమార్‌ను అరెస్టు చేసి స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. కేజీ సత్రానికి చెందిన నాగరాజు, చిత్తూరుకు చెందిన సుధాకర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఎస్‌ఐ ప్రసాద్, పోలీసులు పాల్గొన్నారు.
బధిరుల నూతన
కార్యవర్గం ఎన్నిక
చిత్తూరు కలెక్టరేట్ : ఆంధ్రప్రదేశ్ బధిరుల సంఘం జిల్లా నూతన కార్యవర్గ ఎన్నికలు ఆదివారం పారదర్శకంగా ముగిశాయి. 2026– 2029 కాలానికి కొత్త నాయకత్వం ఎన్నికైంది. జిల్లా అధ్యక్షుడిగా హేమంత్ కుమార్, ఉపాధ్యక్షుడిగా రుకేష్, ప్రధాన కార్యదర్శిగా వంశీకృష్ణ్ణ, సంయుక్త కార్యదర్శిగా బాబు, కోశాధికారిగా గుణశేఖర రెడ్డి, మహిళా కార్యదర్శిగా మానస, కార్యవర్గ సభ్యులుగా విజయకుమార్, బాలచంద్ర ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియ లో రిటర్నింగ్ ఆఫీసర్‌గా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పి.శశికుమార్ వ్యవహరించారు. ఆయన ఎన్నికై న సభ్యులకు అభినందనలు తెలిపారు. జిల్లాలోని బధిరుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ, విద్య, ఉపాధి అవకాశాల మెరుగు, సామాజిక సమగ్రత కోసం కొత్త కార్యవర్గం చిత్తశుద్ధితో పనిచేస్తుందని విశ్వసిస్తున్నట్లు ఆకాంక్షించారు.


