పలమనేరు: పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో ఏడు మండలాలు ఉన్నాయి. ఇక్కడ వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 14,388 వేల హెక్టార్లు. గతేడాది సకాలంలో వర్షాలు కురవలేదు. దీనికితోడు ప్రభుత్వం వేరుశనగ విత్తన కాయలతోపాటు అన్నదాత సుఖీభవ సాయాన్ని సకాలంలో అందజేయలేదు. దీంతో పది శాతం కూడా సాగు కాలేదు. ఈ దఫా అడపాదడపా కురుస్తున్న వర్షాలకు కొంతమంది రైతులు పొలాలను దుక్కులు చేసుకున్నారు. చాలామంది ఇంకా దుక్కులు చేసుకోవాల్సి ఉంది. అంతేగాక రైతులు వేరుశనగ విత్తనాల కోసం ఎదురు చూస్తున్నారు. పలమనేరు వ్యవసాయశాఖ డివిజన్‌లో 40 శాతం సబ్సిడీతో విత్తనాలను పంపిణీ చేయనున్నట్టు స్థానిక ఏడీ గీతాకుమారి తెలిపారు. గతంలో కదిరి–6, నారాయణి రకాలను అందజేయనున్నట్టు పేర్కొన్నారు. మొత్తంగా విత్తనాలు 5,660 క్వింటాళ్ల పంపిణీ చేయనున్నట్టు పేర్కొన్నారు. ఇందులో పలమనేరు మండలానికి 720 క్వింటాళ్లు, బైరెడ్డిపల్లికి 1160, వీకోటకు 1290, రామకుప్పం 1410, శాంతిపురం 1050, కుప్పం 1020, గుడుపల్లి 4630 క్వింటాళ్లు కేటాయించినట్టు వెల్లడించారు. బస్తా (30 కేజీలు) పూర్తి ధర రూ.3060 కాగా 40 శాతం సబ్సిడీ రూ.1224 పోనూ రైతు రూ.1.836 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అదే ఆయా మండలాల్లోని ట్రైబల్స్ ఉండే ఏరియాల్లో 90 శాతం సబ్సిడీ ఉంటుందన్నారు. ఇప్పటి వరకు విత్తన కాయలు స్థానిక గోడౌన్లకు చేరలేదు. ఎప్పుడు పంపిణీ చేస్తారో స్పష్టత లేదు.
జిల్లాలోనే వేరుశనగ సాగు ఎక్కువగా ఉన్న ప్రాంతం పలమనేరు. ఇక్కడ మెట్టభూములు ఎక్కువగా ఉండడం, ఇవి పూర్తిగా వర్షాధారితం కావడంతో రైతులు ఖరీఫ్‌లో వేరుశనగను ఎక్కువగా సాగు చేస్తుంటారు. గతేడాది అదునులో వర్షాలు కురవకపోవడంతో సాధారణ వేరుశనగ విస్తీర్ణంలో పదిశాతం కూడా సాగు కాలేదు. ఈదఫానైనా వేరుశనగ ఆదుకుంటుందా అని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పంట పెట్టుబడికి తప్పని కష్టాలు...
ఎకరా పొలంలో వేరుశనగ సాగు చేయాలంటే ఇప్పుడు పెరిగిన ధరలతో రూ.25 వేలు ఉండాల్సిందే. ఎరువులు, విత్తనాలు, కూలీలు, దున్నకానికి ట్రాక్టర్ ధరలు భారీగా పెరిగాయి. అప్పులు చేసి వేరుశనగను సాగు చేసినా సకాలంలో వర్షాలు కురుస్తాయనే నమ్మకం లేదు. ఆఖరుకు పంట చేతికొచ్చేదాకా రైతులకు దీనిపై గ్యారెంటీ లేదు.


