పెద్దపంజాణి: ఒకప్పుడు పల్లెల్లో ఎడ్ల బండ్లు జీవన విధానంలో విడదీయరాని భాగంగా ఉండేవి. రైతులు తాము పండించిన పంట ఉత్పత్తులను మార్కెట్లకు తరలించడానికి, ప్రయాణాలకు, వివాహాలు వంటి శుభకార్యాలకు ఎడ్ల బండ్లనే ఉపయోగించేవారు. వాటిని రవాణా సాధనాలు మా త్రమే కాకుండా గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచాయి. సంక్రాంతి పండుగల సందర్భంగా నిర్వహించే ఎడ్ల బండ్ల పోటీలు, ఊరేగింపులు గ్రామీణ జీవితంలో ప్రత్యేక ఆకర్షణగా ఉండేవి. ప్రస్తుతం అలాంటి కార్యక్రమాలు కూడా చాలా చోట్ల తగ్గుముఖం పట్టాయి. నేడు ట్రాక్టర్లు, ఆటోలు, బస్సులు, లారీలు, మోటారు వాహనాల రాకతో ఎడ్ల బండ్ల వినియోగం క్రమంగా తగ్గిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రతి ఇంటి ముందు కనిపించే ఎడ్ల బండ్లు నేడు అరుదుగా దర్శనమిస్తున్నాయి. వ్యవసాయ పనుల్లో యంత్రాల వినియోగం పెరగడం, సమయం ఆదా కావడం, తక్కువ శ్రమతో ఎక్కువ పనులు పూర్తి చేయగలగడం తదితర కారణాలతో రైతులు ఆధునిక పరికరాలు, వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఎడ్ల బండ్లకు డిమాండ్ గణనీయంగా తగ్గింది. ఇప్పుడు వృద్ధ రైతులు ఎడ్ల బండ్లతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఎడ్ల బండి తమ జీవితంలో ఒక భాగమని, ఇప్పుడు పిల్లలు వాటిని దగ్గరగా కూడా చూడడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంప్రదాయ వారసత్వానికి ప్రతీకలైన ఎడ్ల బండ్లను సంరక్షించాల్సిన అవసరం ఉందని, ప్రత్యేక ప్రదర్శనల ద్వారా ఎడ్ల బండ్ల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయాలని సంస్కృతి ప్రేమికులు కోరుతున్నారు.
శ్రీవారి దర్శనానికి 18 గంటలు
తిరుమల: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. క్యూకాంప్లెక్స్‌లోని కంపార్ట్‌మెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్ద కు చేరుకుంది. శనివారం అర్ధరాత్రి వరకు 92,010 మంది స్వామిని దర్శించుకున్నారు. 52,346 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.76 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారికి 18 గంటలు పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకుంటున్నారు.


