స్కానింగ్‌.. కన్నింగ్‌! | - | Sakshi
Sakshi News home page

స్కానింగ్‌.. కన్నింగ్‌!

Jun 1 2026 12:14 AM | Updated on Jun 1 2026 12:14 AM

ఆడబిడ్డల ప్రాణాలతో రూ.కోట్ల దందా? జిల్లాలో పుట్టగొడుగుల్లా అక్రమ లింగ నిర్ధారణ కేంద్రాలు బంగారుపాళ్యం ఘటనతో పలు విషయాలు వెలుగులోకి స్కానింగ్‌ ఒకచోట.. గర్భస్రావం మరోచోట.. మందుల సరఫరా ఇంకోచోట పలమనేరు, కాణిపాకం, చిత్తూరు, తిరుపతి కేంద్రాలుగా నెట్‌వర్క్‌?

ఒకప్పుడు అమ్మాయి పుడితే ఇంటికి లక్ష్మిదేవి వచ్చిందనేవారు. అపురూపంగా చూసుకునేవారు. కన్యాదానం చేయడం ద్వారా పుణ్యం పొందవచ్చని భావించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. అమ్మాయిలను పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెట్టడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిపోయింది. ఈ క్రమంలో లింగ నిర్ధారణ పరీక్షలకు డిమాండ్‌ పెరిగింది. ప్రభుత్వం లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధించినా కొంతమంది అక్రమంగా పరీక్షలు నిర్వహిస్తూ రూ.కోట్లు దండుకుంటున్నారు.

కాణిపాకం/బంగారుపాళ్యం: ‘కూతురు పుడితే వద్దు.. అబ్బాయి ముద్దు అన్న మధ్యతరగతి వర్గాల ప్రజల కోరికను కొందరు అక్రమార్కులు ఆసరాగా తీసుకున్నారు. తల్లి గర్భంలోని పిండాన్ని చిది మేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. చట్టాలను చుట్టాలుగా చేసుకుంటూ లింగ నిర్ధారణ–అబార్షన్ల దందాను విస్తరిస్తున్నారు. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. ఒకచోట స్కానింగ్‌, మరోచోట గర్భస్రావం, ఇంకోచోట మందుల సరఫరా, మరొకచోట మధ్యవర్తుల ద్వారా గర్భిణుల రవాణా... ఇలా మొత్తం వ్యవస్థ ఒక గొలుసుకట్టులా పనిచేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బయపడిన బండారం..

బంగారుపాళ్యంలో శనివారం వెలుగుచూసిన అక్రమ స్కానింగ్‌ వ్యవహారం జిల్లాలో కలకలం సృష్టించింది. దీని వెనుక భారీ నెట్‌వర్క్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అధికారికంగా బయటపడింది ఒక్క ఘటన మాత్రమేనని, వాస్తవానికి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఇదే తరహా కార్యకలాపాలు కొనసాగుతున్నాయని స్థానికులతో పాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న మధ్యవర్తులు, ప్రైవేట్‌ క్లినిక్‌లు, మెడికల్‌ షాపులు, స్కానింగ్‌ కేంద్రాలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

పలమనేరు, కాణిపాకంలోనూ అక్రమ స్కానింగ్‌..?

బంగారుపాళ్యం ఘటన తర్వాత కాణిపాకం ప్రాంతంలోనూ అక్రమ స్కానింగ్‌లు చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే పలమనేరు పారిశ్రామిక ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా ఓ స్కానింగ్‌ కేంద్రం పనిచేస్తోందన్న ఫిర్యాదులు అధికారులకు చేరినట్లు సమాచారం.

అబార్షన్‌ కిట్ల విక్రయాలపై ప్రశ్నలు

చిత్తూరు నగరంలోని పొన్నియమ్మ గుడి వీధిలోని ఓ మెడికల్‌ షాపులో మెడికల్‌ టెర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కిట్లు బహిరంగంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా వైద్యుల సలహా, ప్రిస్క్రిప్షన్‌ ఆధారంగానే ఇవ్వాల్సిన మందులను కొందరికి నేరుగా ఇస్తున్నట్టు సమాచారం. ఒక్కో కిట్‌ను రూ.2 వేల వరకు విక్రయిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యవహారం తెలిసినా ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఎందుకు స్పందించడం లేదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

స్కానింగ్‌లో ఆడబిడ్డ అని తేలితే..

బంగారుపాళ్యంలో పట్టుబడ్డ ముఠా సభ్యులు గర్భిణులను ముందుగా రహస్య ప్రాంతాలకు తీసుకెళ్లి స్కానింగ్‌ చేయిస్తారు. ఆడశిశువు అని తేలితే మధ్యవర్తులు రంగంలోకి దిగుతారు. కుటుంబ సభ్యులను ఒప్పించి గర్భస్రావం చేయించేందుకు మార్గం చూపిస్తారు. ఇందుకోసం పలమనేరు, తిరుపతిలోని గైనిక్‌ డాక్లర్లతో డీల్‌ కుదుర్చుకున్నట్టు సమాచారం. గర్భం మూడు నెలల లోపు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేలు, నాలుగు నుంచి ఐదు నెలల వరకు రూ.20 వేలు, ఆరు నెలలు సమీపిస్తే రూ.30 వేల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

అధికారుల దాడులు ఎప్పుడు?

బంగారుపాళ్యం ఘటనతో బయటపడిన అంశాలను ఒక కేసుగా పరిమితం చేయకుండా జిల్లావ్యాప్తంగా సమగ్ర విచారణ చేపట్టాలని ప్రజా సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. బంగారుపాళ్యం, పలమనేరు, కాణిపాకం, చిత్తూరు, తిరుపతి ప్రాంతాల్లో పనిచేస్తున్న స్కానింగ్‌ కేంద్రాలు, ప్రైవేట్‌ క్లినిక్‌లు, మెడికల్‌ షాపులపై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలని కోరుతున్నాయి. ఆరోగ్య, పోలీసు, ఔషధ నియంత్రణ శాఖలతోపాటు జిల్లా యంత్రాంగం సమన్వయంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అక్రమ లింగ నిర్ధారణ–గర్భస్రావాల నెట్‌వర్క్‌ను ఛేదించాలని మహిళా సంఘాలు, సామాజికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement