జిల్లాలో ప్రత్యేధికారుల దుస్థితి ఇదీ రెండు నెలలుగా పెండింగ్‌లో కార్మికుల వేతనాలు 622 పంచాయతీల్లో సమస్యల పరిష్కారానికి అవస్థలు
చిత్తూరు కార్పొరేషన్: పల్లె పాలనకు పెద్దపీట వేస్తామని చెబుతున్న మాటలు క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. ఏదో ఒక సాకుతో పంచాయతీ ఎన్నికలకు వెళ్లడం లేదు. సర్పంచుల పదవీ కాలం ముగయడంతో జిల్లాలోని 622 పంచాయతీలకు ప్రత్యేకాధికారులను నియమించారు. కానీ వారికి వేతనాల చెల్లింపులు, ఇతర పనులకు అనుమతి ఇవ్వలేదు. గత రెండు నెలలుగా పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు లేకుండా అల్లాడుతున్నారు. అదే ఉద్యోగులకు నెలరోజులు జీతం ఇవ్వకపోతే ఉరుకుంటారా అని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇదీ దుస్థితి
పాలనా పగ్గాలు చేపట్టిన ప్రత్యేకాధికారులు ఉత్సవ విగ్రహాల్లా మిగిలిపోయారు. అధికారాలు కాగితాలపైనే తప్ప కార్యాచరణలో కనిపించడం లేదు. బాధ్యతలు చేపట్టి నెల రోజులు గడుస్తున్నా వారికి ఏ మాత్రం అధికారాలు ఉన్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఏప్రిల్ రెండో తేదీతో జిల్లాలోని 622 గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవీ కాలం ముగిసింది. ఆయా స్థానాల్లో వివిధ ప్రభుత్వ శాఖల మండల స్థాయి అధికారులను ప్రత్యేకాధికారులుగా కలెక్టర్ నియమించారు. జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో 13 లక్షల మంది జనాభా ఉన్నారు. ఆయా గ్రామాల్లో వీధిలైట్లు, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం తదితర పనులు చేపట్టాల్సి ఉంది. అత్యవసర పరిస్థితుల్లో చేతిపంపుల మరమ్మతులు, చిన్న చిన్న తాగునీటి ట్యాంకులు, గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా మండల పరిషత్ అధికారులు చేయిస్తున్నారు. వారు ఎంత పర్యవేక్షించినా వేతనాల విషయం వచ్చేటప్పటికి వారికి చేతి చమురు వదిలించుకోక తప్పని పరిస్థితి ఎదురవుతోంది. కారణం ఆయా అధికారులకు చెక్ పవర్ లేకపోవడమే.
రెండు నెలలుగా పెండింగ్
చర్యలు తీసుకుంటున్నాం
ప్రత్యేకాధికారుల నుంచి ఆధార్ నెంబర్‌తో లింక్‌అయిన మొబైల్ నంబర్ ఇతర వివరాలను ఆప్‌డేట్ చేయాలని ఆదేశాలు ఇచ్చాం. ఇబ్బందులు లేకుండా సకాలంలో పనులు చేయాలని తెలియజేశాం. పల్లెల్లో బిల్లుల చెల్లింపులకు ప్రత్యేక అధికారుల థంబ్ ఆప్‌డేట్‌కు చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లిస్తాం.
– సుధాకర్‌రావు, డీపీఓ
ప్రత్యేకాధికారులకు డ్రాయింగ్ పవర్ తప్పనిసరి. బిల్లులపై సంతకాలతో పాటు స్టాంప్ తదితర ధ్రువీకరణలు నమోదు చేయాలి. అనంతరం ఆన్‌లైన్‌లో థంబ్ ఇంప్రషన్ వేస్తేనే బిల్లు పాసయ్యేది. కానీ నాలుగు రోజుల క్రితమే ఆయా ప్రత్యేకాధికారుల నుంచి తంబ్ ఇంప్రెషన్ అథారిటీ అనుమతుల కోసం మండల పరిషత్ అధికారులు ఆధార్ నెంబర్‌తో పాటుగా దాంతో లింక్ అయిన మొబైల్ నెంబర్ వంటి వివరాలను సేకరించారు. జిల్లాలో మొత్తం 27 మండలాలు 622 పంచాయతీలు 5,914 వార్డులు ఉండగా వెయ్యి మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు. వీరికి నెలకు రూ.6 వేలు చొప్పున చెల్లించాల్సి ఉంది. ఈ ప్రక్రియలో జాప్యం వల్ల గ్రామాల్లో చేసిన పనులకు 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి కానీ, జనరల్ ఫండ్ నుంచి కానీ బిల్లుల చెల్లింపులు జరగడం లేదని గ్రామ పంచాయతీల అధికారులు వాపోతున్నారు. కనీసం పారిశుద్ధ్య కార్మికుల వేతనాలు ఇవ్వాలన్నా ప్రత్యేకాధికారి అనుమతితోనే ఇవ్వాల్సిన పరిస్థితి. మార్చి, ఏప్రిల్ నెలలకు సంబంధించి వారికి వేతనాలు చెల్లించలేదని తెలుస్తోంది.


