రాధాకృష్ణా.. క్షమాపణ చెప్పు? | - | Sakshi
Sakshi News home page

రాధాకృష్ణా.. క్షమాపణ చెప్పు?

Apr 28 2026 8:11 AM | Updated on Apr 28 2026 8:11 AM

● వైఎస్సార్‌సీపీ నేతల సతీమణుల పట్ల ఆ రాతలు జుగుప్సాకరం ● క్షమాపణ చెప్పకపోగా.. సమర్థించుకోవడం సిగ్గుచేటు ● వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి ధ్వజం ● పార్టీ సమన్వయకర్తలతో కలిసి చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు

చిత్తూరు అర్బన్‌: తమ పార్టీ నాయకుల సతీమణుల పై ఆంధ్రజ్యోతి–ఏబీఎన్‌ ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరమని.. అతనిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకర రెడ్డి డిమాండ్‌ చేశారు. మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, వైఎస్సార్‌సీపీ సమన్వయకర్తలు విజయానందరెడ్డి (చిత్తూరు), వెంకటేగౌడ (పలమనేరు), కృపాలక్ష్మి (జీడీ నెల్లూరు), డా.సునీల్‌ (పూతలపట్టు) తదితరులతో కలిసి సోమవారం చిత్తూరు ఎస్పీ తుషార్‌డూడీని జిల్లా పోలీసు కార్యాలయంలో కలిశారు. ఏబీఎన్‌ రాధాకృష్ణపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆపై రశీదు తీసుకున్నారు. తమ పార్టీకి చెందిన నాయకుల సతీమణులపై మాట్లాడే అర్హత రాధాకృష్ణకు లేదని, అతను చేసిన వ్యాఖ్యలు చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు. తమ కార్యకర్తలు సోషల్‌ మీడియాలో ఏదో పోస్టు పెడితే అరెస్టు చేస్తున్న పోలీసులు, రాధాకృష్ణపై కూడా చర్యలు తీసుకోవాలని ఎస్పీని కోరారు.

మావిగన్‌పై సానుకూల చర్చ

అనంతరం కరుణాకరరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇటీవల మా నాయకుడు జగన్‌మోహర్‌రెడ్డి రాష్ట్ర రాజధానికి రూ.20 వేల కోట్లతో అద్భుతంగా తయారుచేయొచ్చని, 30 లక్షల జనాభాతో అత్యంత సుందరంగా చేయొచ్చని మావిగన్‌ను సూచించారు. దీనిపై ప్రజల్లో విపరీతమైన సానుకూల చర్చ మొదలయ్యింది. కానీ దీన్ని భరించలేని ఏబీఎన్‌ రాధాకృష్ణ మా పార్టీ నేతల శ్రీమతులపైన అత్యంత అభ్యంతరకరమైన రీతిలో, అమానుషమైన స్థాయిలో, అవమానకర పోకడలతో రాతలు రాశారు. దీనిపై పెద్ద ఎత్తున అలజడి, విమర్శలు ఎదురైతే.. తప్పును సరిదిద్దుకోకుండా, పశ్చాత్తాపం చెందకుండా మళ్లీ అదే వ్యాఖ్యలను సమర్థించుకుంటూ అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తే.. వందలాది మంది పార్టీ నేతలపై కేసులు పెట్టారు. కానీ రాధాకృష్ణపై కేసు పెట్టలేదు..’ అని అన్నారు. ఈ ఘటనపై గాయపడ్డ హృదయాలతో తమ పార్టీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేశామన్నారు. అన్ని చోట్ల కూడా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయాలని కోరితే, పోలీసులు పట్టించుకోలేదన్నారు. అందుకే ఎస్పీలను కలిసి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశామన్నారు. ఎస్పీని కలిసిన వారిలో పార్టీ నాయకులు కెపి.శ్రీధర్‌, చంద్రశేఖర్‌, హరిణిరెడ్డి, భాగ్యలక్ష్మిరెడ్డి ఉన్నారు.

ఉద్దేశపూర్వకంగా పెట్రోలు, డీజిల్‌ కొరత

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా పెట్రోలు, డీజిల్‌ కొరత సృష్టిస్తోందని కరుణాకరెడ్డి దుయ్యబట్టారు. ఇంధనాన్ని బ్లాక్‌ మార్కెట్‌లో అధికధరలకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జనసేన–టీడీపీ పార్టీలు కలిసి రాష్ట్రాన్ని దోచుకుంటున్నా, ఇసుక దందా, భూదందాలు చేస్తున్నా ప్రభుత్వం మౌనంగా ఉందన్నారు. ఇంధన పరిస్థితి చక్కదిద్దే అవకాశం ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో కొన్నిచోట్ల లీటరు రూ.200– రూ.300 ఎక్కువకు విక్రయిస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement