తిరుమల: శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ మహోత్సవాలు సోమవారం సాయంత్రం తిరుమలలో ఘనంగా ముగిశాయి. సాయంత్రం శ్రీ వారి ఆలయం నుంచి స్వామివారు గరుడవాహనంపై, దేవేరులు వేర్వేరు పల్లకీలపై ఊరేగింపుగా బయలుదేరి నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతీ పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేశారు. ముందు రెండురోజుల మాదిరే ఎదుర్కోలు, పూల చెండ్లాట, నూతన వస్త్ర సమర్పణ తదితర కల్యాణ వేడుకలు ఘనంగా ముగిసిన తరువాత కొలువు జరిగింది. అనంతరం రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల ను పారాయణం చేశారు. ఈ సందర్భంగా అన్నమాచార్య ప్రాజెక్టు సుప్రసిద్ధ కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ ఆలపించిన అన్నమయ్య సంకీర్తనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అనంతరం స్వామి దేవేరులతో కలిసి విహరిస్తూ ఆల య ప్రవేశం చేశారు. దీంతో మూడురోజుల పద్మావతీ పరిణయోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ కార్యకమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈఓ రవిచంద్ర, శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.


