ఇక్కడ నేనే బాస్‌! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడ నేనే బాస్‌!

Apr 26 2026 2:57 AM | Updated on Apr 26 2026 2:57 AM

● లక్కనపల్లెలో ప్రైవేట్‌ పాలన ? ● అధికార నేత చెప్పిందే వేదం ● ఎస్పీకి వాట్సాప్‌ ద్వారా మొరపెట్టుకున్న జనం

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: అదో గ్రామ పంచాయతీ అక్కడ పోలీసులు, అధికారం, నిబంధనలను పాటించడం లాంటివి ఉండవు. అసలు అధికారుల పెత్తనం ఏమీ జరగదు. కేవలం ఓ నేత చెప్పినట్టే అధికారులు తలూపాల్సిందే. ఆయన ఏం చేసినా కరెక్ట్‌ అంటూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు ఉండాల్సిందే. గ్రామంలో ఆయనేమి చేసినా ఎవరూ అడ్డు చెప్పకూడదు. నేటి ప్రజాసామ్యంలోనూ ఇలాంటి ప్రైవేట్‌ పాలన సాగుతోందంటే నమ్మశక్యం కాదేమో. కానీ ఇది నిజం అదెక్కడోకాదు చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లి మండలం లక్కనపల్లి గ్రామం.

ఆ నేత ఏం చేసినా నోరూల్స్‌..

ఇటీవల గ్రామంలోని ముస్లిం మైనారిటీలు అనాదిగా వస్తున్న ఉరుసును ప్రశాంతంగా చేసుకునేందుకు ఓ పోలీసు పెద్దాయన వద్ద అనుమతి కోసం వచ్చారు. ఆయన గంగవరం స్థానిక పోలీసు అధికారికి రెఫర్‌ చేశారు. ఆయనేమో ఆ గ్రామంలోని టీడీపీ నేత చెబితేగాని తాము అనుమతులివ్వమని తేల్చి చెప్పాడు. దీంతో ఉరుసు, గంధం పండుగలు ఇప్పటికీ ఆ గ్రామంలో జరగనేలేదు. అదే గ్రామంలో ఆ నేత ప్రమాదకరమైన ఎద్దుల పరుగు పందెంను నిర్వహించి రూ.లక్షల్లో బహుమతులిచ్చారు. ఈ బహుమతులను అక్కడి ఎస్‌ఐతో పాటు పోలీసులే ఇవ్వడం కొసమెరుపు. ఈ ఎద్దుల పరుగు పందేంలో పలువురు తీవ్రంగా గాయపడినా నో పోలీస్‌ యాక్షన్‌.

ట్యాంకును అనుమతి లేకుండానే కూల్చేశారు..

సాధారణంగా ఆయా శాఖలకు చెందిన భవనాలను కూల్చాలంటే ఆయాశాఖ అధికారుల అనుమతులుండాలి. కానీ అక్కడ ఇవేమీ లేవు. గ్రామంలోని పాత రక్షిత నీటి ట్యాంకును తాజాగా ఆయన ఆదేశాలతో నేలమట్టం చేశారు. గతంలో ఆయన ప్రైవేట్‌ స్కూల్‌ కోసం రూ.లక్షలతో నిర్మించిన ఆర్‌అండ్‌బీ డ్రైన్‌ను పూడ్చేశాడు. గ్రామంలో తన బ్యానర్‌ ఏర్పాటు కోసం దాని పక్కనున్న హోటల్‌ను ఖాళీ చేయించేశాడు. ఎవరైనా ఎదురు మాట్లాడితే పోలీసుల ద్వారా కేసులు, దాడులు తప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై జిల్లా ఎస్పీ అయినా పోలీసు నిఘా వ్యవస్థ ద్వారా వాస్తవాలను తెలుసుకొని అక్కడున్న ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించాలని అదే గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు ధైర్యం చేసి ఎస్పీకి వాట్సాప్‌ ద్వారా విన్నవించారు.

Advertisement
 
Advertisement
Advertisement