ఇందిరమ్మ కాలనీలో చోరీ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ కాలనీలో చోరీ

Apr 26 2026 2:51 AM | Updated on Apr 26 2026 2:51 AM

– 16 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు అపహరణ

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): ఇందిరమ్మ కాలనీలోని ఓ ఇంట్లో జరిగిన చోరీపై శనివారం చిత్తూరు తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. చిత్తూరు నగరం మురకంబట్టు ఇందిరమ్మ కాలనీలో బాలాజీ అనే వ్యక్తి ఇంట్లో భారీ దోపిడీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగలగొట్టి..ఇంట్లోకి చొరబడ్డారు. రూ.2.50 లక్షల నగదు, 16 తులాల బంగారం దోచుకెళ్లారు. దీనిపై బాధితుడు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. శనివారం కేసు నమోదు చేసిన తాలూకా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

గుర్తుతెలియని యువకుడి

అనుమానాస్పద మృతి

బంగారుపాళెం: మండలంలోని కొత్తపల్లె బస్‌స్టాప్‌ వద్ద శనివారం అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. మహాసముద్రం టోల్‌ ప్లాజాకు సమీపంలో కొత్తపల్లె బస్‌ స్టాప్‌ వద్ద ఓ వ్యక్తి మృతి చెందిన విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు 40–50 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు చెప్పారు. మృతుడు ఎవరనే వివరాలు తెలియడంలేదన్నారు. ఎందుకు చనిపోయాడు? ఎలా చనిపోయాడనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి చిరునామా తెలిసిన వారు బంగారుపాళెం పోలీస్‌ స్టేషన్‌కు తెలియజేయాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement