– ఎమ్మెల్సీ భరత్
కుప్పం రూరల్ : వైఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ అధైర్య పడొద్దని... వచ్చేది మన ప్రభుత్వమేనని.. అందరికీ అండగా ఉంటామని ఎమ్మెల్సీ భరత్ అన్నారు. సోమవారం తంబిగానిపల్లి గ్రామంలో పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా కుట్రలు, కుతంత్రాలకు దిగుతోందన్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలికారు. వై ఎస్సార్ సీపీ శ్రేణులు ఎవరూ భయపడొద్దని, కూటమి నాయకుల తాటాకు చప్పుళ్లకు తలొంచొద్దని ధైర్యం చెప్పారు. ఇప్పుడు ఎవరైతే పార్టీ జెండా పట్టుకుని నిలబడతారో వారితోనే భవిష్యత్తులో రాజకీయాలు చేస్తామని చెప్పారు. ఎవరు వెళ్లాలన్నా వెళ్లిపోవచ్చని, ఉన్నవారితోనే భవిష్యత్తు ప్రణాళికలు చేసుకుంటామని చెప్పారు. ప్రతి ఒక్కరూ పార్టీ సభ్యత్వాలు చేసుకోవాలని, శ్రేణులు ఎవరైనా మరణించిన, ప్రమాదం సంభవించినా ఇన్సూరెన్స్ రూపంలో రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరుతుందన్నారు. అనంతరం తంబిగానిపల్లి పార్టీ నాయకుల నూతన గృహప్రవేశంలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు మునిరాజు, హఫీజ్, మణి, మోహన్‌రామ్, పీఏ నారాయణరెడ్డి, మనోహర్, సీకేసిలు పాల్గొన్నారు.
‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్ మెడల్
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఎస్.భావన ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్‌న్స్– డేటా సైన్స్‌లో 87.58శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం ఈమేరకు అనంతపురం జేఎన్‌టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్‌అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, విభాగాధిపతి డాక్టర్ స్వప్నసుధ అభినందనలు తెలిపారు.


