చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలో మంగళవారం కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ అమర్‌బాబు తెలిపారు. జిల్లాలోని 40 సెక్షన్ల పరిధిలో అధికారులు, సిబ్బంది పర్యటించి సమస్యలు నమోదు చేసు కోనున్నట్టు వెల్లడించారు.
కిరాతకంగా చంపింది మైనర్లే
– చంద్రమ్మ హత్య కేసులో బిగ్ ట్విస్ట్!
పలమనేరు: పెద్దపంజాణి మండలం, పెద్దముద్దేపల్లికి చెందిన టైలర్ చంద్రమ్మ హత్య విచారణలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. అదే మండలానికి చెందిన సమీ ప బంధువు సుబ్రమణ్యంను ఇటీవల పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వరుసకు పిన్నీ అయిన చంద్రమ్మ వద్ద క్రికెట్ బెట్టింగుల కోసం అప్పు చేసిన సుబ్రమణ్యం దాన్ని చెల్లించకుండా తన స్నేహితుల ద్వారా హత్య చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వివారణ చేపట్టిన పోలీసులు ఈ కేసులో ఏ–2, ఏ–3లు గా ఉన్న వారు అదే మండలం జంగాలపల్లికి చెందిన ఓ బాలుడు (17), చిన్నారికుంటకు చెందిన మరో బాలుడు(17)లుగా గుర్తించారు. సోమవారం పెద్దపంజాణి పోలీసులు వారిని అరెస్ట్ చేసి తిరుపతిలోని జువైనల్ హోమ్‌కు తరలించారు. కాగా వీరు మైనర్లు అయినా ఇందులో ఓ వ్యక్తి లైసెన్సు లేకుండానే టాటాఏస్‌ను ఎలా నడుపుతున్నాడు, ఇతనిపై ఎంవీఐ చట్టం మేరకు ఎందుకు కేసు పెట్టలేదనే మాట వినిపిస్తోంది. మరో మైనర్ పెళ్లిళ్లలో క్యాటరింగ్ హెల్పర్‌గా ఉంటూ ఈ హత్యలో పాల్గొన్నట్టు విచారణలో వెలుగు చూసింది.
హత్య కేసులో
ఇద్దరికి జీవిత ఖైదు
చిత్తూరు అర్బన్: స్నేహితుడినే మద్యం మత్తులో కొట్టి చంపిన ఇద్దరు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ చిత్తూరులోని 8వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. నిందితులు శరవణ (32), మణికంఠ (33)కు ఈ మేరకు శిక్ష విధిస్తూ సుంకర శ్రీదేవి తీర్పునిచ్చారు. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.జ్యోతిరామ్ కథనం మేరకు.. చిత్తూరు నగరంలోని మంగసముద్రంకు చెందిన రవికుమార్, ఢిల్లీబాబు, శరవణ, మణికంఠ స్నేహితులు. 2021 ఏప్రిల్ 13న వీళ్లంతా కలిసి ఓ నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవిస్తున్నారు. రవికుమార్ తనకు మద్యం కావాలని పదేపదే అడుగుతుండడంతో ఆవేశానికి గురైన శరవణ, మణికంఠ కలిసి రాళ్లతో అతనిపై దాడి చేశారు. రవికుమార్ స్ఫృహతప్పి పడిపోగా.. మిగిలిన ముగ్గురూ ద్విచక్ర వాహనంలో పారిపోయారు. కొంతదూరం వెళ్లాక ద్విచక్ర వాహనం ఆపి.. ఢిల్లీబాబు విషయం పోలీసులకు చెబుతాడని భావించి అతడిని కూడా హత్య చేయడానికి దాడిచేశారు. అతను తప్పించుకుని పారిపోయి చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చేరాడు. జరిగిన విషయం పోలీసులకు తెలియడంతో అప్పటి చిత్తూరు తాలూక ఎస్‌ఐ విక్రమ్ ఘటనా స్థలానికి వెళ్లగా.. అప్పటికే రవికుమార్ చనిపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదుచేసి నిందితులు శరవణ, మణికంఠను అరెస్టు చేసి, కోర్టుకు తరలించారు. కేసును నాటి సీఐ బాలయ్య దర్యాప్తు చేశారు. కోర్టులో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ఇద్దరు నిందితులను జీవితఖైదు, ఒక్కొక్కరికీ రూ.3 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు.


